మున్సిపల్ ఎన్నికల్లో ‘కారు’ సత్తా చాటుదాం..
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని , కాంగ్రెస్ అక్రమాలను, సీఎం మోసాలను ఎండగట్టి ప్రతి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల కోసం సోమవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ , రాబోయే ఎన్నికల కోసం క్యాడర్‌లో ఉత్సాహం నింపుతూ రేవంత్ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకుండానే మనం అత్యధిక స్థానాలు గెలుచుకున్నామని , కానీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన ‘కారు’ గుర్తు ఉంటుందని కేటీఆర్ గుర్తు చేశారు . కేసీఆర్ నాయకత్వాన్ని, కారు గుర్తును గుర్తుపెట్టుకుని ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమని , అభ్యర్థుల ఎంపికలో పార్టీ ఆచి తూచి నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు . కొడంగల్‌తో సహా 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను ప్రజలు బొందపెట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఒక నిజాయతీ గల మోసగాడని రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేని వ్యక్తి, పాలమూరును సస్యశ్యామలం చేస్తానంటే ఎవరు నమ్ముతారు? కేసీఆర్‌కు పేరు వస్తుందనే భయంతో కృష్ణా జలాల విషయంలో తన పాత బాస్‌కు లొంగిపోయి పాలమూరు రైతన్నలను ఎండపెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు . రాష్ట్ర నిధులను మూటలు కట్టి ఢిల్లీకి పంపిస్తూ, ఆంధ్రా కాంట్రాక్టర్లకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. జిల్లాల పునర్విభజన పేరుతో జిల్లాలను ముట్టుకుంటే రాష్ట్రంలో అగ్గి రగులుతుందని, అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దహించివేస్తుందని హెచ్చరించారు. రెండేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అప్పుడే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో పయనిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

