News

అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో తేల్చుకుందాం రా…

అవినీతి రారాజు చంద్రబాబు నాపై ఆరోపణలా?
దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్న వైసీపీ ఎమ్మెల్యే
పెదకూరపాడు అభివృద్ధిపై లెక్కలు చెప్పడానికి సిద్ధం
గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్తారా?
చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు సవాల్

అవినీతి చేసి ఓటమి పాలైన వాళ్లు తనపై ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. 2014 నుంచి 2019 వరకు పెదకూరపాడులో 1100 కోట్లతో అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను నాలుగేళ్లలో 1377 కోట్లతో సంక్షేమ పథకాలు, 655 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని.. వాటి లెక్కలు చెప్పేందుకు సిద్ధమని, టీడీపీ అభివృద్ధి చేశామంటున్న రూ.1100 కోట్ల అభివృద్ధి వివరాలు చెప్పగలరా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఇసుక తవ్వకాల వల్ల 28 మంది చనిపోతే.. చంద్రబాబు.. ఆ పాపం తనకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ రూ.100 కోట్లు ఫైన్ వేసింది టీడీపీ హయాంలోనే అన్న విషయం చంద్రబాబు మర్చిపోయారన్నారు. ఇటీవల అమరావతి మండలంలో ఇద్దరు చనిపోవడానికి కారణం.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి చేసిన ఇసుక తవ్వకాలేనని దుయ్యబట్టారు.

పెదకూరపాడు నియోజవకర్గంలో అమరావతి – బెల్లంకొండ డబుల్ లేన్ రోడ్డు తాము వేస్తున్నామని, అమరావతి – తుళ్లూరు రోడ్డు తామే వేస్తామని చెప్పారు. ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పెదమద్దూరు బ్రిడ్జి నిర్మాణ పనులు కనిపించలేదా అని ప్రశ్నించారు. అలాగే కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు తెచ్చి, త్వరలో నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. అభివృద్ధి చేయలేదంటున్న చంద్రబాబు, అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు వయసుతో పాటు చాదస్తం పెరిగిందన్నారు శంకరరావు. తన పేరును కూడా అవమానపరిచే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేసే స్థాయికి చంద్రబాబు దిగజారాడని ఆక్షేపించారు. చినపిచ్చయ్య అందించిన అబద్ధపు వివరాలతో పెదపిచ్చయ్య తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు. చంద్రబాబు అమరావతి పర్యటన పెద్ద ఫెయిల్ అని.. జనం రాకపోవడంతో ప్రస్టేషన్‌లో విజ్ఞతకోల్పోయి మాట్లాడారన్నారు.

బాబు వస్తే జాబు వస్తుందని మళ్లీ చెబుతున్నారని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగాలు, పోలీస్, డీఎస్సీ 98 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. జగనన్న పాలనలో ఆదాయం లేదంటున్న చంద్రబాబుకు, జీడీపీ, జీఎస్టీల్లో రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉన్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. రైతులకు, మహిళలకు రుణమాఫీ పేరుతో మాయమాటలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జనంలోకి వస్తున్నారన్నారు. గతంలో విజన్ 2020 అని ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు విజన్ 2047 అనడంపై జనమే నవ్వుకుంటున్నారన్నారు.