Andhra PradeshHome Page Slider

చిదిమేసిన మిచౌంగ్ తుఫాన్

విరిగిన చెట్లు ,తెగిన విద్యుత్ తీగలు అంధకారంలో పట్టణాలు, పల్లెలు
సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం
తీరం దాటిన తుఫాను

మీచౌంగ్ తుఫాన్ ఏపీలోని కోస్తా జిల్లాలను చిదిమేసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు ఆయా జిల్లాలు విలవిల లాడాయి. గడిచిన 48 గంటలుగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం ,బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, కోనసీమ జిల్లాలపై తుఫాను బీభత్సాన్ని సృష్టించింది. దీంతో భారీ వర్షాలకు చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. జిల్లా కేంద్రాలు కూడా చీకట్లోనే అల్లాడిపోతున్నాయి. ప్రధానంగా నెల్లూరు నగరం 80% పైగా ప్రాంతాల్లో విద్యుత్తు లేకపోవడంతో పట్టణ ప్రజలు మంచినీటి కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు విద్యుత్ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి విద్యుత్ పునరుద్ధరణ చర్యలు వేగంగా చేపడుతుంటే మరోవైపు అంతే వేగంగా మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి కరెంటు వైర్లు తెగిపోతున్నాయి. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలు రెండు రోజులుగా చీకట్లోనే మగ్గారు.

అదేవిధంగా జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. గ్రామీణ రహదారుల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద నది పొంగి ప్రవహించడంతో జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో కోల్‌కతా, చెన్నై రహదారిపై గత రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఆయన భేటీ అయ్యారు. తుఫాను పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా పునరావస కేంద్రాల్లో ఉన్నవారితో బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు.