Home Page SliderNational

నన్ను చూసి నేర్చుకోండి… పదవికి రాజీనామా చెయ్ షిండే

నేను చేసినట్లే ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలి
సుప్రీం ఉత్తర్వుల షిండేకు సవాల్ విసిరిన థాక్రే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు ప్రజాస్వామ్యాన్ని “హత్య” చేశారన్నారు ఉద్ధవ్ థాక్రే. సుప్రీం కోర్టు తీర్పు తర్వాతైనా షిండే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. “ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఏక్‌నాథ్ షిండే గెలిచారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌కి ఏదైనా నైతికత ఉంటే, వారు రాజీనామా చేయాలి” అని థాక్రే హితవు పలికారు. ‘షిండే వర్గం ఎమ్మెల్యేలు, నా పార్టీకి, మా నాన్న వారసత్వానికి ద్రోహం చేశారు. అప్పుడు నేను సీఎం పదవికి రాజీనామా చేయడం చట్టరీత్యా తప్పే కావచ్చు, కానీ నైతిక కారణాలతో చేశాను… వెన్నుపోటు పొడిస్తే నేనేం చేయాలి ? ” అంటూ ప్రశ్నించారు. గత సంవత్సరం శివసేన తిరుగుబాటుతో ధాక్రేకు ఎదురుదెబ్బ తగిలింది. తన మాజీ బాస్‌పై తిరుగుబాటు చేసి, అప్పటి గవర్నర్ చట్టవిరుద్ధమైన నిర్ణయం వల్ల షిండే సీఎం పీఠాన్ని పొందారని సుప్రీంకోర్టు పేర్కొంది.

గత ఏడాది జూన్ 30న అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీఎస్ కోష్యారీ పిలవడం సమర్థనీయం కాదని, అయితే బలపరీక్షను ఎదుర్కొని రాజీనామా చేయనందున, ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు నైతిక విజయమంటూ ఉద్ధవ్ థాక్రే వర్గం అభిప్రాయపడింది. షిండే వర్గానికి చెందిన సభ్యుడిని శివసేన విప్‌గా నియమించాలని స్పీకర్ తీసుకున్న నిర్ణయం “చట్టవిరుద్ధం” అని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

తిరుగుబాటు తర్వాత థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అగాడీ (ఎంవిఎ) ప్రభుత్వ పతనానికి దారితీసిన రాజకీయ సంక్షోభానికి సంబంధించిన అభ్యర్థనలపై భారత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. థాక్రే బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేసినందున, సభలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీ సూచించినట్టుగా షిండేను గవర్నర్ ఆహ్వానించడం సమర్థనీయమని పేర్కొంది. “సభలో తన మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ థాక్రేను పిలవడం సమర్థనీయం కాదు, ఎందుకంటే థాక్రే సభ విశ్వాసాన్ని కోల్పోయారనే నిర్ధారణకు కారణాలు లేవు” అని కోర్టు పేర్కొంది.