మండుటెండల్లోను జనం బాటపడుతున్న నాయకులు
ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ ఇప్పటికే అన్ని పార్టీల నేతలు జనం ముంగిట వాలిపోతున్నారు. ఎవరు ముందు ఎవరు వెనక అనేది తేల్చుకుంటున్నారు. ఒకవైపు భానుడు భగభగలాడుతుంటే మరోవైపు పొలిటికల్ పార్టీలు వేడిని పెంచాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో ఆ పార్టీ నేతలు ఆనందంలో ఉన్నారు.ఇక అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రతి గడపను చుట్టేశారు. ఇది చాలదన్నట్లు ఇంటింటికి జగనన్న స్టిక్కర్ పేరిట మరో కొత్త కార్యక్రమానికి తెర లేపారు.

ఇక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో జతకట్టే ఆలోచనలతో ఉండటంతో ఆ పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే అప్పుడే ఎన్నికల సందడి మొదలైందా అని అనిపిస్తుంది. మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం ఈనెల 20వ తేదీ వరకు జరగనుంది. కొద్ది నెలల కిందటే గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంతో ఇంటింటికి వెళ్తున్న ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో పాటు పలు సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరిన ప్రజలందరూ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారని జగన్ ఫోటో కలిగిన స్టిక్కర్లను ప్రజల స్వచ్ఛందంగా వారి ఇండ్లకు అతికించుకుంటున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, నాలుగు సంవత్సరాల కాలంలో ఏపీలో అభివృద్ధి ఏమి జరగలేదని ప్రజల్లోకి విస్తృతంగా వెళుతుంది. ఇటీవల కాలంలో మూడు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ క్యాడర్లో జోష్ మరింత పెరిగింది. మరొక పక్క ఆ పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ మండుటెండలో సైతం పాదయాత్ర చేస్తూ ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అవినీతిపై గళమెత్తుతున్నారు.

అధికార వైయస్సార్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండ చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీని గద్దే దించడమే లక్ష్యంగా వేస్తున్న అడుగులకు ప్రజలు మద్దతు లభిస్తోందంటోంది జనసేన. ప్రజలు సైతం ఈ పరిణామాలను ఆహ్వానిస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి దీటుగా నిన్ను నమ్మం జగన్ అన కార్యక్రమానికి కూడా జనసేన పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. ఇలా అన్ని పార్టీల నేతలు మండుటెండలను సైతం లెక్కచేయకుండా ప్రజల్లోకి వెళుతూ ఇప్పుడే ఎన్నికల వాతావరణ సృష్టిస్తున్నారు.మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది.


