మునుగోడు ముంచేస్తుందా?
ప్రజాప్రతినిధులకు టార్గెట్ ఫిక్స్ చేసిన కేసీఆర్
మెజార్టీ తేడా వస్తే ఇక అంతే సంగతులు
భయభయంగా మునుగోడులో నేతలు
భవిష్యత్లో టికెట్లు రావన్న ఆందోళన
మునుగోడులో పనిచేస్తున్న టీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ ఎక్కువవుతోంది. తమ రాజకీయానికి మునుగోడు ఎక్కడ అడ్డమొస్తోందోనన్న బెంగ వెంటాడుతోంది. కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను పాటించుకుంటే ఏమవుతుందోనన్న వర్రీ గులాబీ నేతలకు నిద్ర కరువు చేస్తోంది. మునుగోడుకు ఇప్పటి వరుకు 100 మంది నేతలను పార్టీ నియమించింది. 77 ఎంపీటీసీ వార్డులుగా విభజించిన పార్టీ ఒక్కో వార్డులో ఒక్కో అగ్రనేతను మోహరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ మునుగోడులో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. నియోజకవర్గంలో నేతలు హుషారు పెంచి పనిచేస్తున్నారు. ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. కానీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా లేదా అన్నదానిపై మాత్రం వారిలో ఆందోళన కన్పిస్తోంది.

మునుగోడులో తేడా వస్తే రాజకీయంగా తమ పరిస్థితి ఏమవుతుందోనన్న వర్రీ వారిలో ఉన్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఎక్కడైనా టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం తక్కువ వచ్చినా.. ఓట్లు రాకున్నా… ఆ ప్రభావం తమపై ఉంటుందోనని నేతలు వణుకుతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర్నుంచి ప్రజల్లో తిరుగుతున్న నేతలు కొందరు పబ్లిక్ పల్స్ అర్థం కాక తలలుపట్టుకుంటున్నారు. ఎన్నికల్లో తేడా వస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించదేమోనన్న బెంగలో ఉన్నారు. కానీ వాస్తవానికి మునుగోడు తర్వాత పలువురు టీఆర్ఎస్ నేతలు సైతం పార్టీ మారతారన్న ప్రచారం ఉంది. కొందరు మంత్రులు సైతం, పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో విన్పిస్తోంది.

అందుకే మునుగోడులో తేడా వస్తే పార్టీకి ఎక్కడ డామేజ్ కలుగుతుందోనని కేసీఆర్ సైతం వర్రీలో ఉన్నారు. ఏదైనా తేడావస్తే మీ సంగతి చూస్తా అన్నట్టుగా పరిస్థితి ఉందని ఎమ్మెల్యేలు, ఎంపీలు లోలోన మథనపడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత బలప్రయోగంతో రాజకీయాలు చేయలేమన్న అభిప్రాయం ఇప్పటికైనా కలగడం లేదన్న భావన కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రజలు నచ్చిన పార్టీకి ఓటేస్తారని… మంత్రులో, ఎమ్మెల్యేలో చెబితే వేయరని అనేకసార్లు రుజవయ్యింది కూడా. ఇలాంటి తరుణంలో ప్రజాప్రతినిధులకు టార్గెట్లు ఫిక్స్ చేసి… ఓట్లు తగ్గితే మీ సంగతి చూస్తా, వచ్చే ఎన్నికల్లో టికెట్లు లభించవని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. అందుకే గులాబీ నేతలు మునుగోడులో ప్రచారం చేస్తున్నప్పటికీ సెకండ్ ఒపినియన్ సైతం తీసుకుంటున్నారట.