NationalNews

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో లక్ష్మణ్‌

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్‌కు చోటు దక్కింది. బోర్డును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం పునర్వ్యవస్థీకరించారు. సభ్యులుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు రాజ్‌నాథ్‌సింగ్‌, యడ్యూరప్ప, శర్బానంద్‌ సోనావాల్‌, ఇక్బాల్‌ సింగ్‌, సుధాయాదవ్‌, సత్యనారాయణ జటియా, బీఎల్‌ సంతోష్‌, భూపేంద్ర యాదవ్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌, హోం మాధుర్‌, వనతి శ్రీనివాస్‌లు కొనసాగుతారు. లక్ష్మణ్‌కు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలోనూ స్థానం కల్పించారు. పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లను తొలగించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా బోర్డులో చోటు దక్కకపోవడం విశేషం. బీజేపీలో అత్యున్నత నిర్ణాయక కమిటీగా పార్లమెంటరీ బోర్డుకు గుర్తింపు ఉంది. ఈ బోర్డు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో సమావేశమవుతుంది. ఇతర కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది.

ఇంతటి కీలకమైన కమిటీ నుంచి మోదీ కేబినెట్‌లో కీలక మంత్రి అయిన గడ్కరీని తొలగించడం పెద్ద షాక్‌. ఈ కమిటీలో బీజేపీ మాజీ అధ్యక్షులకు స్థానం కల్పించడం ఆనవాయితీ. బీజేపీ మాజీ అధ్యక్షుడు కూడా అయిన గడ్కరీకి మాత్రం చోటు దక్కలేదు. ఈ బోర్డులో రాజ్‌నాథ్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. గతేడాది కర్ణాటక సీఎంగా రాజీనామా చేయించిన 77 ఏళ్ల కర్ణాటక బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్పకు ఇప్పుడు అత్యున్నత కమిటీలో చోటు దక్కడం కీలక పరిణామం. 75 ఏళ్లకు పైబడిన వారిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న బీజేపీ నిర్ణయానికి ఇది విరుద్ధం. మరోవైపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు స్థానం కల్పించారు.