శబరిమలలో పోలీసుల లాఠీచార్జ్..భక్తుల ఆగ్రహం
ఎన్నడూ లేనిది అయప్ప స్వామి భక్తులపై శబరిమలలో పోలీసుల లాఠీచార్జ్ చేశారు. దీనితో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాల ధరించిన భక్తులు డిసెంబరు చివరి వారం సమీపిస్తుండడంతో ‘స్వామియే శరణం అయప్ప’ అంటూ భక్తకోటి శబరిమలకు పోటెత్తారు. కార్తీక మాసం మొదలుకొని, మకర సంక్రాంతి వరకూ నల్లని దుస్తులతో, చలిని లెక్కచేయకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా నియమనిష్టలతో ఆ స్వామిని కొలిచే అయప్పభక్తులు మనకు అడుగడుగునా దర్శనం ఇస్తూంటారు. అయప్పమాల వేసుకుని ఇరుముడులతో ఆ స్వామిని దర్శించుకుందామనే ఆశతో శబరిమలకు వెళ్లిన భక్తులకు నిరాశే ఎదురయ్యింది.

భక్తులపై కనీస కనికరం లేకుండా పోలీసులు లాఠీ ఝళిపించారు. విపరీతమైన రద్దీ పెరిగిపోవడంతో నిన్న రాత్రి నుండి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను నిలిపివేశారు పోలీసులు. దానికి తోడు అయ్యప్ప స్వాములకు కనీసం మంచి నీళ్ళు కూడా అందించలేదు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు. ప్రతీ ఏడాది ఈ సీజన్లో వచ్చే అయ్యప్ప భక్తులకు సరైన కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని భక్తులు వాపోతున్నారు. 18 కంపార్టుమెంట్లలో అయ్యప్ప స్వాములు వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 10 గంటలకు పైగా పడుతున్న సమయం పడుతుండడంతో భక్తులు సహనం కోల్పోయారు. చిన్న పిల్లలు ఉన్నారని , ఎంతసేపు నిల్చోవాలంటూ పోలీసులను నిలదీశారు. దీనితో భక్తులపై దాష్టీకానికి పాల్పడ్డారు పోలీసులు. భక్తులపై లాఠీచార్జ్‌కు తెగబడ్డారు. దీనితో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సదుపాయాలు కల్పించలేకపోయారు కానీ భక్తులపై దాడులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

