తెలంగాణా, ఏపీ మధ్య డబుల్ కేబుల్ బ్రిడ్జి
కృష్ణానది అందాలు రెట్టింపు చేేసేలా కొత్త ప్రాజెక్టుకు రంగం సిద్ధమవుతోంది. దేశంలోనే తొలిసారిగా రెండు అంతస్తుల కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదించారు. దీనికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదముద్ర లభించింది. మరో రెండు నెలల్లో జాతీయ రహదారుల విభాగం ఈ కేబుల్ వంతెనకు టెండర్లు పిలువబోతోంది. తదుపరి రెండేళ్లకాలంలో ఇది సిద్ధం కావచ్చు. తెలంగాణా- ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ కృష్ణానదిపై ఈ వంతెన రెండు అంతస్తులుగా ఉంటుంది. పై అంతస్తులో వాహనాలు వెళ్లే ప్రధాన క్యారేజ్ వే ఉంటుంది. దాని దిగువ అంతస్తులో పర్యాటకులు నడుచుకుంటూ వెళ్లే గాజు వంతెన పారదర్శకంగా ఉంటుంది. దానిపై నడుస్తూ సోమశిల ప్రకృతి సౌందర్యం, కృష్ణానది పరవళ్లను తిలకించే అవకాశం ఉంటుంది.

తెలంగాణా నుంచి ఏపీలోని నంద్యాల వైపు దూరం తగ్గించే క్రమంలో కొత్త జాతీయ రహదారి ప్రతిపాదించారు. నంద్యాల, తిరుపతి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా కొల్లాపూర్ మీదుగా కృష్ణానదిని దాటేలా వంతెన నిర్మిస్తే దాదాపు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై ఉన్న కోట్రా జంక్షన్ నుంచి మల్లేశ్వరం, అక్కడ నుండి నంద్యాల వరకు 173 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు వరుసలుగా నిర్మించాలని నిర్ణయించారు. దీనికోసం కృష్ణానదిపై వంతెన అవసరమైంది. దీనిని సాదాగా నిర్మించకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా గొప్పగా నిర్మించాలని అధికారులు భావించారు. పాపికొండలు తరహాలో ఈ ప్రాంతం అత్యంత మనోహరంగా ఉంటుంది. ఇక్కడికి నిత్యం వేలల్లో పర్యాటకులు వస్తారు. గాజు వంతెన నిర్మిస్తే కృష్ణమ్మ పరవళ్లు తిలకించే అవకాశం కూడా ఉంటుందని ప్రతిపాదనలు జరిగాయి. 800 మీటర్ల పొడవుండే ఈ వంతెన నిర్మాణానికి దాదాపు 1,082 కోట్ల రూపాయల వ్యయం అంచనా వేశారు.

దుర్గం చెరువు మీద ఉండే సస్పెన్షన్ వంతెన తరహాలో ఇప్పుడు సోమశిలపై స్తంభాలు లేని కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఇది రెండు భారీ పైలాన్లతో తెలంగాణాలో మల్లేశ్వరం తీరం, ఏపీలోని సంగమేశ్వరతీరాలను కలుపుతుంది. ఈ పైలాన్లకు రెండువైపులా 30 జతల భారీ కేబుల్స్ ఏర్పాటు చేసి వాటి ఆధారంగా వంతెన నిలిచేలా నిర్మిస్తారు. దీని నుంచి చూస్తే చుట్టూ ప్రకృతిని, గాజు ప్యానెల్స్ నుంచి దిగువనున్న కృష్ణానది అందాలను ఆస్వాదించవచ్చు, పర్యాటకులు నదిలో నడుస్తున్న అనుభూతిని పొందవచ్చు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే దేశంలోనే మొట్టమొదటి రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జిగా మారబోతోంది. కృష్ణమ్మ నడుముకు వడ్డాణంలా ఈ వంతెన భాసిల్లనుంది.