వయనాడ్‌లో కొండచరియల బీభత్సం..పెరుగుతున్న మృతుల సంఖ్య
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో ఆకస్మికంగా కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించింది. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి వద్ద నేడు తెల్లవారుజామున భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అంతకంతకు మృతులు పెరుగుతున్నారు. ఇప్పటివరకూ 19 మంది మరణించారని సమాచారం. ఇంకా వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని భావిస్తున్నారు. చురల్మల పట్టణంలో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. వెల్లర్మల పూర్తిగా నీట మునిగింది. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు. ఈ ప్రభావం దాదాపు 400 కుటుంబాలపై ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు. చాలామంది జాడలు తెలియడం లేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్‌ను కూడా వినియోగిస్తున్నారు. అక్కడ ఉండే వంతెన కూలిపోవడంతో అత్తమల, చురల్మల పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం, అధికారులను సహాయక చర్యలలో ఉండమని ఆదేశించారు. విపత్తు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి, కేంద్రం నుండి అన్నిరకాల సహాయాలను అందిస్తామని తెలిపారు. మృతి చెందిన వారికి పీఎం NRF కింద రూ.2 లక్షలు పరిహారం చెల్లిస్తామని, క్షతగాత్రులకు రూ.50 వేలు ఇస్తామని ప్రధాని కార్యాలయం తెలియజేసింది.
వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేరళ ముఖ్యమంత్రితో, వయనాడ్ కలెక్టర్‌తో మాట్లాడానని ఎక్స్‌లో తెలియజేశారు.
ఈ ఘటనపై ఇంకా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు.