Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

రూపాయికి, అర్ధ రూపాయికి భూ పందేరం

విశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా విశాఖపట్నం నగర పరిధిలో పెద్ద ఎత్తున భూ పందేరం నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏపీలో రూపాయికి, అర్థ రూపాయికి భూ కేటాయింపులు జరుగుతున్నాయని ప్రశ్నించిన ఆయన, పక్క రాష్ట్రాల్లో కూడా ఇలానే భూములు ఇస్తున్నారా? అని నిలదీశారు. విశాఖపట్నం శుక్రవారం మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్‌, ఏపీలో జరుగుతున్న భూ పందేరంలో భాగంగానే ఈ తరహా కేటాయింపులు జరుగుతున్నాయని మండిపడ్డారు.
తమ వైఎస్సార్‌సీపీ హయాంలో ఏ కంపెనీకి రూపాయికి భూములు ఇవ్వలేదని, ఇన్ఫోసిస్‌ లాంటి పెద్ద పరిశ్రమ తమ హయాంలోనే వచ్చిందని అమర్నాథ్ గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సత్వ, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల భూములను తక్కువ రేటుకు ఎందుకు ఇస్తున్నారని, మీకు నచ్చిన సంస్థలకు రూపాయి, అర్ధ రూపాయికి ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. సత్వ సంస్థకు ఇచ్చిన భూమిలో రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు, ప్లాట్స్ కట్టుకోమని ఎలా అనుమతులు ఇస్తారని, రియల్ ఎస్టేట్ సంస్థలకు తక్కువ రేటుకు భూమి ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ రాయితీలు కూడా ఇస్తారా అని మండిపడ్డారు. లులు సంస్థ గుజరాత్ రాష్ట్రంలో ఎకరా భూమిని కోట్లాది రూపాయలకు కొంటే, మన రాష్ట్రంలో నామమాత్రపు ధరకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు.
విశాఖ అభివృద్ధిపై నాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏం చెప్పారో, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే చెబుతున్నారన్నారు. విశాఖ అనేది రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌ అని జగన్‌ ఏనాడో చెప్పారని, 2014లో చంద్రబాబు ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నించారు. విశాఖకు ఇన్ఫోసిస్ లాంటి గొప్ప ఐటీ పరిశ్రమ తెచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌దేనని, టీసీఎస్ విశాఖ రావడానికి కూడా జగన్ కృషి ఉందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానంటే మునిగిపోతుందని వార్తలు రాసిన మీడియా, చంద్రబాబు అభివృద్ధి చేస్తానంటే ‘ఆహా ఓహో’ అంటూ వార్తలు రాస్తోందని ఆయన విమర్శించారు.
చివరగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించిన అమర్నాథ్, లోకేష్‌ను ప్రమోట్ చేయడం కోసం ప్రభుత్వ ధనంతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రకటనల్లో కనీసం పరిశ్రమల శాఖ మంత్రి ఫోటో కూడా వేయడం లేదని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్‌తో పాటు మోదీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసేవారని, నేడు ప్రకటనల్లో మోడీ, పవన్ ఫోటోలు చుక్కలా మారిపోయాయి అని ఆయన ఎద్దేవా చేశారు.