Andhra PradeshNews

కుప్పంలో జరిగిందేంటి?

కుప్పంలో అసలేం జరిగింది? టీడీపీ ఏం చెబుతోంది? వైసీపీ ఇస్తున్న కౌంటర్ ఏంటి? కుప్పంలో జరుగుతున్న మొత్తం పరిణామాలపై ఏపీ అంతటా ఫోకస్ కన్పిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు కక్షలు, కార్పణ్యాలకు నెలవుగా మారుతోంది. ప్రతిపక్షనేతగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రికార్డులు సృష్టిస్తూ వార్తల్లో ఉండే నియోజకవర్గం కాస్తా ఇప్పుడు రణరంగంగా మారిపోతోంది.

కుప్పంలో వైసీపీ విధ్వంసమంటూ టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. శాంతియుత ప్రదర్శనపేరుతో జులుం ప్రదర్శించారని ఆరోపిస్తోంది. దీంతో కుప్పం పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిందంటూ అసలు కథ వివరిస్తోంది. అన్న క్యాంటీన్ వద్ద వైసీపీ నేతలు… టీడీపీ లీడర్ల ఫ్లెక్సీలు చింపేయడంతో అసలు వివాదం మొదలయ్యింది. దీంతో అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారంటూ టీడీపీ నేతలు ఎమ్మెల్సీ భరత్ ఇంటివైపు వెళ్లే ప్రయత్నం చేయడంతో నియోజకవర్గంలో యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసుల లాఠీ చార్జీతో పలువురు టీడీపీ నేతలు గాయపడ్డారు.

కుప్పం నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమయ్యెందుకు వచ్చిన చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ కార్యకర్తలపై దాడులు ఎందుకంటూ మండిపడ్డారు. అన్న క్యాంటీన్ ఉన్న ఏరియాకు చేరుకొని ఆందోళనకు దిగారు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం చరిత్రలో చీకటి రోజుగా అభిప్రాయపడ్డారు. పేదలకు అన్నం పెట్టేవారిపై దాడులు చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.

ఇదిలా ఉంటే వైసీపీ వర్షన్ మరోలా ఉంది. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలే దాడులకు దిగారంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. కుప్పం నియోజకవర్గంలో వరుస ఓటములతో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆ పార్టీ ఆరోపించింది. టీడీపీ కార్యకర్తలే… వైసీపీ కార్యకర్తలపై దాడులుకు తెగబడ్డారంటూ ఆక్షేపించింది. టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురికి గాయాలయ్యాయని… పోలీసులను వదిలిపెట్టలేదని ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు. కుప్పం వీధుల్లో కర్రలతో సంచరించారని… స్థానిక ఎంపీపీ ప్రాణభయంతో పరుగులు పెట్టారంది. మొత్తంగా టీడీపీ గుండాగిరి అంటూ వైసీపీ ధ్వజమెత్తుతోంది.

మొత్తంగా కుప్పంలో అసలేం జరుగుతోందన్నదానిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల జరిగిన కుప్పం పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీపై వైసీపీ విజయబావుటా ఎగురేసింది. గతంలో టీడీపీ కంచుకోటగా ఉన్న కుప్పం చేజారిపోతుందని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్నదానిపై విచారణ మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ పార్టీలో పదవులు, అధికారాన్ని అనుభవించిన నేతలు ఏం చేస్తున్నారో విచారించారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చేవారు కరువయ్యారని గ్రహించారు. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు కుప్పం వస్తూ పార్టీని పటిష్టపరిచేలా కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ఇలాంటి తరుణంలో కుప్పంలో రాజకీయాలు వేడెక్కాయ్. చంద్రబాబు రాకతో వైసీపీ శ్రేణులు నిరసనలు శృతి మించుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.