కుంభమేళా @ 60 కోట్లు..
అలహాబాద్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ప్రపంచ నలుమూలల నుండి భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 13న మొదలైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగియనుంది. అయితే ఇప్పటి వరకూ పవిత్ర త్రివేణి సంగమంలో జనవరి 13 నుండి ఫిబ్రవరి 22 వరకూ 60 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ప్రతీ 12 ఏళ్లకు వచ్చే ఈ కుంభమేళాకు మొదట్లో 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ ఇంకా ఐదు రోజులు సమయం మిగిలి ఉండగానే 60 కోట్ల మార్క్‌ను దాటింది. జనవరి 29 మౌని అమావాస్య నాడు ఒక్కరోజులోనే 8 కోట్ల మంది వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. అప్పుడు జరిగిన తొక్కిసలాటలోనే 30 మందికి పైగా భక్తులు మృతి చెందారు. శివరాత్రికి కూడా భారీగా భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.