Home Page SliderNews AlertTelangana

పేపర్‌ లీక్‌ వ్యవహారంపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. ఈ కేసులో ఎవరైన ఉన్నా సరే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. సీఎం కేసీఆర్‌తో మంత్రులు, ఉన్నతాధికారుల భేటీ ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. కమీషన్‌ కోసం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పేగానీ.. సంస్థ వైఫల్యం కాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నాలుగు పరీక్షలు రద్దు చేశామని అన్నారు. ఈ పరీక్షలను రాసే విద్యార్థులు ఎవరూ ఫీజు చెల్లించనవసరం లేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారంతా పరీక్ష రాసేందుకు అర్హులే. ఈ నాలుగు పరీక్షలకు సంబంధించి కోచింగ్‌ మెటీరియల్‌ అంతా ఆన్‌లైన్లో పెడతామన్నారు. విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్‌ ఇచ్చే బాధ్యత ప్రభుత్వనిదే అన్నారు. ఉచిత మెటీరియల్‌తోపాటు ఉచిత భోజన వసతి కూడా అందిస్తామని తెలిపారు.