సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్..
•ప్యాలెస్ కి రమ్మంటావా? కోటకు రమ్మంటావా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, “చర్చకు ఎక్కడికైనా సిద్ధం. ప్యాలెస్‌కి రమ్మంటావా? కోటకు రమ్మంటావా? తేడా లేదు, చర్చిద్దాం. కానీ అసెంబ్లీలో మా మైక్ కట్ చేయకుండా ఉంటే” అని రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. సవాలు చేసి పారిపోయే “పిరికిపంద” లాగా కాకుండా నేరుగా వచ్చి సమాధానం చెప్పాలని హితవు పలికారు. కేటీఆర్ ప్రసంగంలో మరో ముఖ్య అంశం రేవంత్‌పై మానసిక ఆరోపణలు. “రేవంత్ మానసిక హాస్పిటల్లో చూపించాల్సిన స్థితిలో ఉన్నారు. ఆధారాలు లేకుండా డ్రగ్స్, ఫార్ములా-ఈ, ఫోన్ ట్యాపింగ్ వంటి ఆరోపణలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు” అంటూ ఆరోపించారు. “ఇరవై నెలల పాలనలో ఏ ఒక్క అభివృద్ధి పనీ చేయలేకపోయిన కాంగ్రెస్, నిరవధిక డ్రైవర్షన్ పాలిటిక్స్‌తోనే కొనసాగుతోందని” అన్నారు. అంతేగాక, ఇటీవల జరిగిన లోకేశ్-కేటీఆర్ భేటీపై వచ్చిన విమర్శలపైనా స్పందిస్తూ, “ఒకరిని కలవడం నేరమా? అవసరముంటే ఎవరినైనా కలుస్తాం, దాన్లో తప్పేముంది?” అని అన్నారు. కాగా, ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ, బనకచర్లపై చర్చ జరిగిందని తెలిపారు. ఈ విషయంపై రేవంత్ అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు.స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలకు ధీమా కలిగించిన కేటీఆర్, “గత పదేళ్లలో పార్టీ కోసం కష్టపడిన నాయకులే ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పిటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలవాలి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో గులాబీ జెండా ఎగురాలి. ప్రజలు ప్రభుత్వం మీద విసుగు చెందారు, ఈ వ్యతిరేకతను మేము అవకాశంగా మలచుకుంటాం” అన్నారు.