బెల్లంపల్లి మీటింగ్‌లో కథ చెప్పిన కేటీఆర్
బెల్లంపల్లి పబ్లిక్ మీటింగ్‌లో ఆసక్తికరమైన కథను చెప్పారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ఈ కథను చెప్పారు. కాంగ్రెస్ ఈనాడు అధికారం కోసం అర్రులు చాస్తోందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్యోగాలు, రైతులకు కరెంటు విషయంలో విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉందని, రైతులకు కరెంటు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేదని, తమ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక పిల్లవాడి కథను చెప్పారు. ఒక అబ్బాయి విపరీతంగా దురలవాట్లకు, తాగుడుకు లోనయ్యి, తల్లిదండ్రులనే కొట్టి చంపాడని, దీనితో పోలీసులు అరెస్టు చేసి, కోర్టుకు తీసుకువెళ్లారు. జడ్జి అతనిని చూసి, సొంత తల్లిదండ్రులనే చంపిన నీకు ఏ శిక్ష వేయాలని అడుగగా ఆ అబ్బాయి వినయం నటిస్తూ తల్లిదండ్రులు లేని అనాధనని దయతలచి తక్కువ శిక్ష వేయమని అడిగాడట. ఇప్పుడు కాంగ్రెస్ వారి పని కూడా అలాగే ఉందని, దశాబ్దాలుగా వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ అభివృద్ధి పనులు చేయలేదని, ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణా ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.