కేటీఆర్.. 24 గంటలు టైమిస్తా నిరూపించు..
మునుగోడు అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ శనివారం ప్రకటించింది. దీంతో సోమవారం నామినేషన్ వేస్తానని ఆయన చెప్పారు. మునుగోడు ప్రజల తీర్పుతోనే కేసీఆర్ పతనం మొదలవుతుందన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తనకు పోటీనే కాదన్నారు. ఇక్కడి ప్రజల యుద్ధం కేసీఆర్‌పైనే అని ధీమా వ్యక్తం చేశారు. గత 8 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్ష కోట్ల అవినీతి సొమ్మును బయటకు తీసుకొచ్చే వరకూ నిద్రపోనని శపథం చేశారు. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర రుజువైందని, వచ్చే ఏడాది బతుకమ్మను ఆమె చంచల్ గూడ లేదా తీహార్ జైల్లో ఆడతారని జోస్యం చెప్పారు.

రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు..
తనకు కేంద్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినందుకే బీజేపీలో చేరానని.. తాను క్విడ్ ప్రోకోకు పాల్పడ్డానని మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌కు 24 గంటల టైం ఇస్తున్నానని.. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని.. లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఓపెన్ బిడ్డింగ్‌లో పాల్గొన్న తమ కంపెనీ రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కించుకుందని 6 నెలల క్రితం నిర్వహించిన ఓ చర్చా వేదికలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఈ వీడియోను టీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


 
							 
							