ఇక ఉద్యోగాలే, ఉద్యోగాలు.. ఫాక్స్‌కాన్‌కు కేటీఆర్ శంకుస్థాపన
పరిశ్రమల ఏర్పాటుతో యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు
కొంగరకలాన్ లో ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటుకు అట్టహాసంగా భూమిపూజ
తెలంగాణ యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం విశేషంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో ఫాక్స్ కాన్ టెక్నాలజీస్ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటు అవుతుండడం చారిత్రాత్మక సందర్భమన్నారు. మొదటి దశలోనే రూ. 4 వేల కోట్ల పెట్టుబడితో, 200 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్ కాన్ ప్లాంట్ ను నెలకొల్పడంతో 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. కేవలం రెండున్నర నెలల వ్యవధిలోనే అన్ని అనుమతులను పూర్తి చేసుకుని కంపెనీ ఏర్పాటు కోసం భూమిపూజ చేసుకోవడం జరుగుతోందని, ఇంత వేగంగా, సమర్థతతో పని జరగడం తామెక్కడా చూడలేదని ఫాక్స్ కాన్ కంపెనీ చైర్మన్ పేర్కొనడం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతకు, తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు.

గడిచిన తొమ్మిదేళ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కొత్త పుంతలు తొక్కుతూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ సహా ఇతర అనేక అంశాల ప్రాతిపదికన తెలంగాణకు జాతీయ స్థాయిలో వరుస అవార్డులు వరిస్తుండడం కేసీఆర్ ప్రభుత్వ దార్శనిక పాలనకు నిదర్శనమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగాలు కల్పించడం, సంపదను సృష్టిస్తూ అన్ని వర్గాల వారికి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం సవాలుగా మారిందన్నారు. అందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదని, 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాలు సహా అన్ని రంగాలను కలుపుకుని 60 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగల్గుతోందని తెలిపారు. దేశ జనాభాలో ఇది 0 . 5 శాతం మాత్రమేనని అన్నారు. నాలుగు కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో రెండు శాతానికి పైగా ఆరు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని వివరించారు. మిగతా కోటీ యాభై లక్షల మంది యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ప్రైవేట్ రంగంలో భారీగా పెట్టుబడులు సాధించేందుకు ఇతోధికంగా కృషి చేస్తున్నామన్నారు. తద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు అపారమైన సంపద సృష్టించబడుతుందని, సంక్షేమాభివృద్ధికి ఇది దోహదపడుతుందని తెలిపారు.

ఫాక్స్ కాన్ ప్లాంట్ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయి ఎంతో అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ అన్నారు. కష్టపడి తెస్తున్న కంపెనీలను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హితవు పలికిన మంత్రి కేటీఆర్, స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభించేలా కృషి చేయాలని సూచించారు. మరో తొమ్మిది నెలల వ్యవధిలో ఫాక్స్ కాన్ కంపెనీ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయనున్న నేపథ్యంలో, ఆలోపు స్థానిక నిరుద్యోగ యువతీ,యువకులకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ ప్లాంట్ ప్రారంభం అయ్యే నాటికి వారు ఉద్యోగాలకు అన్ని విధాలుగా అర్హత సాధించేలా చొరవ చూపాలని హితవు పలికారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఫాక్స్ కాన్ సంస్థ ఉత్పత్తి కార్యక్రమాలకు రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను రప్పించడంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అహరహం శ్రమిస్తూ అంతర్జాతీయ స్ధాయ్యి కంపెనీలను ఆకట్టుకోవడంలో సఫలీకృతులవుతున్నారని కొనియాడారు. తెలంగాణ పట్ల నిబద్దత, పరిపూర్ణమైన అవగాహనతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతున్నారని అన్నారు. స్థానికంగా ఫాక్స్ కాన్ సంస్థ తన ఉత్పత్తులను ప్రారంభించనుండడం ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది అత్యంత కీలకమైనదని మంత్రి అన్నారు. ఈ సంస్థ పూర్తి స్థాయిలో తన ఉత్పత్తులను ప్రారంభిస్తే లక్ష మందికి పైగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆకాంక్ష మేరకు ఫాక్స్ కాన్ కంపెనీ లో స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించేలా కృషి చేస్తామన్నారు.

ఒక్కోటిగా వచ్చి చేరుతున్న పరిశ్రమలతో ఈ ప్రాంతం హైటెక్ సిటీని తలదన్నే రీతిలో అభివృద్ధి దిశగా వడివడిగా ముందుకు సాగుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంత ప్రజలు తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం భూములను అమ్ముకోకుండా వాటిని కాపుడుకోవాలని, పరిశ్రమల స్థాపనతో భూముల ధరలు గణనీయంగా పెరగనున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హితవు పలికారు. జిల్లాలో 64 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంతో 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫార్మాసిటీలో పూర్తిస్థాయిలో పరిశ్రమలు ఏర్పాటైతే 5.60 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించగా, ఫాక్స్ కాన్ టెక్నాలజీస్ కంపెనీ సీ.ఈ.ఓ యాంగ్ లియు, కలెక్టర్ హరీష్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, డీ సీ సీ బీ చైర్మన్ మనోహర్ రెడ్డి, డీ సీ ఎం ఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.