నన్ను, నా బిడ్డని కేటీఆర్, హరిష్ రావు చంపాలనుకుంటున్నారు..
తెలంగాణలోని భూపాలపల్లిలో తొమ్మిది రోజుల క్రితం నాగవెళ్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే రాజలింగమూర్తి హత్యపై విచారణ జరిపించాలని ఆయన భార్య సరళ ప్రభుత్వానికి విన్నవించారు. ఈ క్రమంలోనే తన భర్త హత్యపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తన బాధను విన్నవిస్తూ రాజలింగమూర్తి భార్య ఓ వీడియో విడుదల చేశారు. తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని సరళ కన్నీళ్లు పెట్టుకున్నారు. నన్ను, నా బిడ్డని కేటీఆర్, హరిష్ రావు చంపాలని చూస్తున్నారు! నాకు భయంగా ఉంది.. ఇది వరకే నా భర్తను నరికి చంపారని సరళ వీడియోలో పేర్కొంది. తన భర్త రాజలింగ హత్య కేసులో ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ నేత హరిబాబు పరారీలో ఉండడంపై తమకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. తన భర్త హత్య వెనుక కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణా రెడ్డి హస్తం ఉందని ఆమె ఆరోపించారు. సీబీఐ ఎంక్వెరీ చేసి అసలు దోషులను పట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు. స్థానిక పోలీసులపై తనకు నమ్మకం లేదని చెప్పారు.


 
							 
							