NewsTelangana

చివరి కోరిక తీరకుండానే కన్నమూసిన కృష్ణంరాజు

తెలుగు సినీ ఇండస్ట్రీలో రెబస్ స్టార్ గా చెరిగిపోని ముద్ర వేసిన కృష్ణంరాజు ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన హఠాత్తుగా మరణించడంపై తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు యావత్ తెలుగు ప్రజలు దిగ్బ్రాంతికి చెందుతున్నారు. 1940 జనవరి 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. వీరు విజయనగర సామ్రాజ్య రాజకుటుంబానికి చెందిన వారు.


కృష్ణంరాజు మొదట చదువు పూర్తి అయిన తరువాత జర్నలిస్ట్ గా కూడా పని చేశారు. కానీ సినిమాలపై ఆసక్తితో చెన్నె చేరుకున్న కృష్ణంరాజు 1966 లో చిలక గోరింక చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కృష్ణంరాజు తెలుగు చలనచిత్రాల్లో చెరిగిపోని ముద్ర వేశారు. 183 సినిమాలకు పైగా నటించిన ఆయనకు భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, మన వీరు పాండవులు వంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక రాజకీయాల్లో కూడా ఎంపీ గానూ, కేంద్ర మంత్రిగాను కృష్ణంరాజు రాణించారు. ఈ మద్య కాలంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ లో కూడా కృష్ణంరాజు ప్రత్యేక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

కృష్ణంరాజు 83 సంవత్సరాలకు పైబడి ఉండడంతో వయసు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ప్రధానంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఎప్పటికప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందారు . అయితే సమస్య ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే కృష్ణంరాజు బ్రతికి ఉన్న రోజులలో తన సోదరుడి కొడుకు అయిన ప్రభాస్ పెళ్లి చూడాలని ఉందంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.తనకు ప్రభాస్ పెళ్లి చేయడం కంటే పెద్ద కోరిక ఏమీ లేదని.. ప్రభాస్ పిల్లలతో నటించాలని ఉందని చాలాసార్లు వేదికలపై చెప్పుకొచ్చారు. అమ్మాయిని చూస్తున్నామని, త్వరలోనే ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన వార్త చెబుతామంటూ కృష్ణంరాజు మీడియా సమావేశాల్లో తరచూ చెబుతుండేవారు. ఆయన తన చివరి కోరికను తీర్చుకోకుండానే మరణించడం చాలా బాధాకరమని చెప్పాలి. ఆయన అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.