కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వచ్చాడోచ్..!
భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ వివాదాస్పద నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయకుండా ఇంతకాలం ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేసిన వెంకట్‌రెడ్డి ఎన్నికలకు సరిగ్గా ఒక్క రోజు ముందు మునుగోడులో దిగడం ఆసక్తికరంగా మారింది. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేయడం.. తన తమ్ముడికే ఓటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు వెంకట్‌రెడ్డి ఫోన్ చేసిన ఆడియో సోషల్ మీడియాలో లీక్ కావడం.. తాను ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని ఆస్ట్రేలియాలో చేసిన వ్యాఖ్యల వీడియో కలకలం రేపడం.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేయడం.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్‌లో జరగనుండటం.. ఇలాంటి ఘటనల మధ్య వెంకట్‌రెడ్డి తీసుకునే స్టెప్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మునుగోడులో చక్రం తిప్పుతాడా..?
నిజానికి పోలింగ్ పూర్తయిన తర్వాత వస్తారనుకున్న వెంకట్ రెడ్డి పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే మునుగోడులో దిగడంతో ఈ ఎన్నికల్లో ఆయన చివరి రోజు ఏం చేస్తారో అని అన్ని పార్టీల నాయకులూ భయపడుతున్నారు. పోల్ మేనేజ్‌మెంట్ మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన పార్లమెంటు పరిధిలోకే వచ్చే మునుగోడుపై వెంకట్‌రెడ్డికి మంచి పట్టు ఉంది. దీంతో నియోజక వర్గంలో ఆయన చక్రం తిప్పే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు ఏమైనా చేస్తారా.. అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తారా..
మునుగోడు ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని వెంకట్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఏం సమాధానం ఇస్తారోనంటూ పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు.. హైదరాబాద్‌లో రాహుల్ పాదయాత్రలో వెంకట్‌రెడ్డి పాల్గొంటారని కొందరు పార్టీ నాయకులు భావిస్తున్నారు. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకుండానే రాహుల్ పాదయాత్రలో పాల్గొంటారా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తానికి తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం కోసం వెంకట్‌రెడ్డి ఎలాంటి వ్యూహం అమలు చేస్తారోనని అన్ని పార్టీల వాళ్లు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

