ఏపీలో కొడాలి నాని దిష్టి బొమ్మ దగ్ధం
ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికార,ప్రతిపక్షాల మధ్య పోరు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలిచే వ్యక్తి మాజీ వైసీపీ మంత్రి కొడాలి నాని. ఈ మేరకు ఆయన తాజాగా ప్రతిపక్షంపై చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారీ తీశాయి. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంపై విరుచుకు పడ్డారు. చంద్రబాబు,లోకేష్‌లను అసభ్యకర పదజాలంతో దూషించారు. దీంతో రాష్ట్రంలోని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. ఈ మేరకు ఏపీలోని పలు ప్రాంతాలలో వారు నిరసనలు చేపట్టారు. అనంతపురంలో కొడాలి నాని దిష్టి బొమ్మను టీడీపీ కార్యకర్తలు దగ్దం చేశారు. కొడాలి నాని దిష్టి బొమ్మ మెడలో చెప్పులదండ వేసి మరి వారు ఆయన దిష్టి బొమ్మకు నిప్పంటించారు. అంతేకాకుండా ఆయన చంద్రబాబు,లోకేష్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయమై రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. అయితే పోలీసులు మాత్రం వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

