Home Page SliderTelangana

అడవుల పెంపకంలో ‘రాష్ట్ర ప్రభుత్వ వాటా’ కోసం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

ఆడవుల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ వ్రాసారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. “కాంపెన్ సేటరీ అఫారెస్టేషన్ ఫండ్” కింద కేంద్రప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. ప్రకృతిని పరిరక్షించటం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఎన్నో రకాల వన్యప్రాణులకు, ప్రత్యేకమైన ఉత్పత్తులకు, ఔషధమూలికలకు, గిరిజన ప్రజలకు ఆవాసాలుగా ఉన్న అడవులు ఈ ప్రకృతిలో ఒక భాగం. మానవ అవసరాల కోసం చేపడుతున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కొన్ని ప్రాంతాలలో ఈ అడవులను ఉపయోగించుకోవలసి వస్తోంది. అలాంటి సమయంలో కొంత అటవీ విస్తీర్ణాన్ని కోల్పోవలసి వస్తోంది. తద్వారా, ఈ అడవుల మీద ఆధారపడి ఉన్న ఎన్నో రకాల ప్రాణులకు ఇబ్బంది కలగడమేకాకుండా, ప్రాకృతిక విపత్తులు సంభవించటానికి కూడా అవకాశాలు ఉన్నాయి.

చెట్లను విరివిగా నాటి పచ్చదనాన్ని పెంచటం ద్వారా ఆయా ప్రాంతాలలో కోల్పోయిన అటవీ విస్తీర్ణాన్ని తిరిగి పెంపొందించవచ్చని భావించి కేంద్రప్రభుత్వం “కాంపెన్ సేటరీ అఫారెస్టేషన్ ఫండ్” (CAMPA) ను ఏర్పాటు చేయడం జరిగింది. 2019  నుండి 2022 వరకూ  కేటాయించబడిన నిధుల విలువకు 1,737 కోట్లు ఉంది.  వినియోగించుకున్న నిధుల విలువ 1,127 కోట్లు మాత్రమే. ఈ రెండిటి మధ్య దాదాపు రూ. 610 కోట్ల వ్యత్యాసం ఉంది.

అడవుల పెంపకం కోసం CAMPA ఫండ్ క్రింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వార్షిక ప్రణాళికల లక్ష్యాలను చేరుకోవడం లేదు. గత కొన్ని సంవత్సరాల కాలంలో దాదాపు రూ. 30 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా, ఆయా పథకాల క్రింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయవలసిన రూ.2.20 కోట్ల నిధులను కూడా విడుదల చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. నిధులను సత్వరమే విడుదల చేసి వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పడాలని కోరుతూ ఈ లేఖను సీఎం కేసీఆర్‌కు పంపారు కిషన్ రెడ్డి.