Home Page SliderTelangana

కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థానాలు ఎక్సేంజ్, ఈటల ఎటువైపు? –బీజేపీ కీలక నిర్ణయం

తెలంగాణ బీజేపీలో సరికొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయని విశ్వసనీయ సమాచారం లభించింది. బీజేపీ జాతీయ నాయకత్వం సుదీర్ఘ కసరత్తు చేసిన అనంతరం ఈ నిర్ణయాలు తీసుకుందని అనుకుంటున్నారు. కిషన్ రెడ్డిని కేంద్రమంత్రి పదవి నుండి తప్పించి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానూ, బండి సంజయ్‌ను కేంద్రమంత్రిగానూ మార్చబోతున్నారు బీజేపీ హైకమాండ్. ఇక చేరికల కమిటీ కన్వీనర్‌గా అసంతృప్తితో ఉన్న బీసీ నేత ఈటల రాజేందర్‌ను ఎన్నికల ప్రచార కమిటీ వ్యూహకర్తగా నియమించబోతున్నట్లు సమాచారం. బీజేపీలో ఏర్పడిన వర్గపోరును ప్రారంభంలోనే అణచి వేయాలని, అసంతృప్తి నేతలను బుజ్జగించడమే కాకుండా వారిని సరైన స్థానాలలో ఉంచి, వారికి ప్రాముఖ్యతను ఇచ్చింది హై కమాండ్. ఎలాగైనా బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వీరు ముగ్గురూ పని చేయాలని సూచించింది. కిషన్ రెడ్డి అజాత శత్రువు, రెడ్డి కులస్తుడు కావడంతో ఆ సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించబోతున్నారని అనుకుంటున్నారు. కేంద్ర సహాయమంత్రిగా ఇప్పటివరకూ రాష్ట్రఅధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను నియమించనున్నారు. ఇక ఈటల రాజేందర్‌కు గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉండడం, బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే ధైర్యం గల నాయకుడిగా, మాస్ లీడర్‌గా పేరుపొందారు. దీనితో ఆయనను ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తే పార్టీ బలోపేతమవుతుందని భావిస్తున్నారు బీజేపీ అధిష్టానం.