Andhra PradeshHome Page Slider

బెజవాడలో 30లక్షలకు డీల్ కుదుర్చుకున్న కిడ్నీమాఫియా

బెజవాడలో 30 లక్షల రూపాయలు ఆశ చూపి, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కిడ్నీని కాజేశారు కిడ్నీ మాఫియా ముఠా. కేవలం లక్ష రూపాయలు చేతిలో పెట్టి కిడ్నీ కొట్టేసారంటూ బాధితుడు వాట్సాప్‌లో సీపీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పులు తీర్చాలనే ఉద్దేశ్యంతో లా బుక్స్ అమ్ముకునే కొండపల్లికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి కిడ్నీ అమ్మకానికి పాల్పడ్డాడు. కరోనా కారణంగా, అమరావతి రాజధాని మార్చిన  కారణంగా తనకు పని దొరకక అప్పులు చేయాల్సి వచ్చిందని, అప్పుల వారి బాధ ఎక్కువ అవడంతో కిడ్నీలు అమ్ముకునైనా అప్పుతీరుస్తాను అని మాటవరసకి అన్న మాటలకి, నిజంగానే బ్రోకర్‌ను ఎరేంజ్ చేశారట అప్పుల వాళ్లు.

కొండపల్లికి చెందిన మందా రామ్మోహన్, బారోతు రమేశ్ అనే వ్యక్తులు 30 లక్షలకు కిడ్నీ మాఫియాతో డీల్ కుదిర్చారట. నాగేశ్వరరావుతో పాటు, అతని భార్య కిడ్నీకి కూడా అగ్రిమెంట్ రాయించుకున్నారట. సరైన ఆర్డీవీ అప్రూవల్ లేకుండానే అతని కిడ్నీని తీసుకున్నారు డాక్టర్లు. చివరికి అతనికి కేవలం ఒక లక్ష మాత్రమే చేతిలో పెట్టారట. చివరికి ఈ విషయం వెలుగులోకి రాకుండా 5 లక్షలకు సెటిల్‌మెంట్ చేసుకున్నారట. అప్పులు తీర్చుకుని, పిల్లలను బాగా చదివించుకోవాలనే ఉద్దేశ్యంతో కిడ్నీ మార్పిడికి ఒప్పుకున్నారట. ఈ విషయంలో స్వర ఆసుపత్రి కీలక పాత్ర పోషించిందని బాధితుడు తెలిపారు.  కిడ్నీ ఇవ్వడం, తీసుకోవడం నేరమని, కేవలం దానంగానే తప్ప అవయవాలను అమ్మడం అనేది చట్టప్రకారం నేరమని ప్రజలు తెలుసుకోవాలి.