NationalNews

ఇందిరాపై ఖర్గే తిరుగుబావుటా..!

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అరుదైన గౌరవాన్ని 86 ఏళ్ల మల్లికార్జున ఖర్గే దక్కించుకున్నారు. సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా గుర్తింపు పొందిన ఖర్గే వారి అండదండలతోనే శశిథరూర్‌పై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన 26వ తేదీన పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఖర్గే గెలిచినా పార్టీ రిమోట్‌ కంట్రోల్‌ సోనియా గాంధీ చేతిలోనే ఉంటుందని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి.. అయితే.. ఖర్గే ఒకానొక సమయంలో ఇందిరా గాంధీపైనే తిరుగుబాటు చేయడం విశేషం. కాంగ్రెస్‌ పార్టీని కూడా వీడారు. తర్వాత చేతులు కాల్చుకొని మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి గాంధీ కుటుంబానికి పరమ విధేయుడిగా మారారు.

కాంగ్రెస్‌ను వీడిన ఖర్గే..

1970వ దశకం చివర్లో నాటి కర్నాటక సీఎం దేవరాజ్‌ ఉర్సుకు ప్రధాని ఇందిరా గాంధీతో విభేదాలు తలెత్తాయి. ఖర్గేకు రాజకీయ గురువు అయిన దేవరాజ్‌.. సంజయ్‌ గాంధీ రాజకీయాల్లోకి రావడాన్ని వ్యతిరేకించారు. ఆ సమయంలో కర్నాటక సీఎం, రాష్ట్ర పార్టీ చీఫ్‌ పదవులను కలిగి ఉన్న దేవరాజ్‌.. రెండు పదవులను వదులుకునేందుకు ఇష్టపడలేదు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున సీఎం పదవి నుంచి దేవరాజ్‌ను తొలగించలేకపోయిన ఇందిరా.. జనతా పార్టీకి దగ్గరవుతున్నారన్న నెపంతో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించారు. దీంతో దేవరాజ్‌ 1979లో కాంగ్రెస్‌ (యూ) అనే సొంత పార్టీ పెట్టారు. తన రాజకీయ గురువుకు అండగా నిలిచిన ఖర్గే ఆ పార్టీలో చేరారు. అయితే.. కర్నాటకలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన దేవరాజ్‌ 1980 లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు.

ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు..

దేవరాజ్‌తో పాటు మళ్లీ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న ఖర్గే తర్వాత పార్టీకి దూరం కాలేదు. తన ఇద్దరు కుమారులకు రాహుల్‌, ప్రియాంక్‌ అని.. కుమార్తెకు ప్రియదర్శిని అని పేర్లు కూడా పెట్టుకున్నారు. కర్నాటక నుంచి 9 సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఖర్గే.. గాంధీ కుటుంబం ఆశీర్వాదాలతో పాటు శశిథరూర్‌కు మద్దతుగా నిలిచిన జీ 23 (అసమ్మతివాదులు) గ్రూపు మద్దతు కూడా పొందగలగడం విశేషం. కర్నాటక ముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ వచ్చినా తీసుకోకుండా పార్టీ విధేయతను కొనసాగించారు.  

1976లో మంత్రిగా..

విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఖర్గే.. కార్మిక సంఘం నాయకుడిగా ఎదిగారు. న్యాయవాద వృత్తిని అభ్యసించి కాంగ్రెస్‌లో చేరారు. 1969లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 1976లో దేవరాజ్‌ ఉర్సు కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఆయన తొలుత లోక్‌సభలో.. తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా వ్యవహరించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన తొలి గాంధీయేతర వ్యక్తిగా నిలిచారు. ఈ పదవి చేపట్టిన రెండో దళిత నాయకుడిగా గుర్తింపు పొందారు.

ముందున్నది ముసళ్ల పండగే..

అయితే.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాల ఎత్తుగడలను, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహాలను తట్టుకొని 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం ఖర్గేకు అంత సులభమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల రూపంలో ఆయనకు తొలి అగ్ని పరీక్ష ఎదురుకానుంది.  తర్వాత రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఏడాదిన్నర కాలంలో 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం పార్టీని సన్నద్ధం చేయడం 86 ఏళ్ల ఖర్గేకు సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తానికి.. ఖర్గే ముందున్నది ముసళ్ల పండగే.