కాక రేపుతున్న ఖమ్మం కాంగ్రెస్ సభ
ఖమ్మంలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రేపటి ఖమ్మం భారీ కాంగ్రెస్ సభలలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, అతని అనుచరులకు బెదిరింపు లేఖలు అందాయి. ప్రచారం కోసం మీడియాలో చెడు ప్రచారాలు చేస్తున్నారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆలేఖల సారాంశం. చిల్లర విమర్శలు చేస్తున్నారంటూ మంత్రి పువ్వాడ అజయ్ వర్గం ఈ లేఖలు, పోస్టర్లు అంటించిందని పొంగులేటి ఆరోపిస్తున్నారు. పైగా కాంగ్రెస్ భారీ సభను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ శత విధాల ప్రయత్నిస్తోందని, బస్సులు అందుబాటులోకి రాకుండా చూస్తున్నారని, ఖమ్మంలో రెండు రోజుల పాటు సభ జరిగే ప్రాంతాలకు మంచినీటి సరఫరా బంద్ చేశారని, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా సభకు వచ్చేవారిని అడ్డుకోవడానికి 10 కిలోమీటర్ల దూరం వరకూ చెక్ పోస్టులు పెట్టారని పొంగులేటి విమర్శిస్తున్నారు. సభకు వచ్చేది నక్సలైట్లా, ఉద్యమకారులా అని నిలదీసారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో వచ్చే సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకూ న్యాయం అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్ని అవాంతరాలు సృష్టించినా రేపటి సభ విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.