కోలాహలంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
గణపతి ఉత్సవాలలో హైదరాబాద్‌కు మకుటాయమానంగా చెప్పుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వైభవంగా ప్రారంభమయ్యింది. నేటి ఉదయం 6 గంటలకు గణేశునికి కమిటీ సభ్యులు హారతి ఇవ్వడంతో ఈ యాత్ర ప్రారంభమయ్యింది. భక్తుల కోలాటాలు, జయజయధ్వానాల మధ్య యాత్ర కొనసాగుతోంది.

ఈ శోభాయాత్రకు నగరం నలుమూలల నుండి భక్తులు పోటెత్తారు. యువకులు ఆనందోత్సాహాలతో ఆడుతూ వినాయకుని గంగమ్మ ఒడికి తీసుకువెళ్తున్నారు. లక్డీకాపూల్ సర్కిల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామయ్యింది. మహిళలు, యువతులు నృత్యాలు చేస్తూ కోలాహలంగా నడుస్తున్నారు. యువత సెల్ఫీలు తీసుకుంటూ కేరింతలు కొడుతున్నారు.

పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలలోపున హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం పూర్తి కావచ్చని భావిస్తున్నారు.