మేడిగడ్డపై రాష్ట్రప్రభుత్వ కీలక నిర్ణయం
మేడిగడ్డ బ్యారేజి పూర్తయ్యిందంటూ గతంలో నిర్మాణ సంస్థకు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రాష్ట్రప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రకటించింది. గత ప్రభుత్వం ఇచ్చిన వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ బ్యారేజి నిర్మాణంలో లోపాలున్నాయని, దెబ్బతిన్న నిర్మాణాలకు మరమ్మత్తులు చేయాలని, ఒప్పందం ప్రకారం పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. గతంలో గుత్తేదార్లు ఇవేమీ చేయకుండానే పనులు పూర్తయినట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని ఎలా ఇచ్చారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తప్పుపట్టింది. ఒప్పందం ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీచేసింది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజిని జూన్ 21,2019నాడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 2020లోనే అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చారు. బ్యారేజి దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయని, వియరింగ్ కోట్ దెబ్బతిందని, బాగుచేయాలని కోరారు. అయితే దీనికి నిర్మాణ సంస్థ సమాధానమిచ్చింది. బ్యారేజి దిగువన డ్యామేజెస్ గుర్తించామని, వాటిని అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామని, అన్నారం, సుందిళ్లలో కూడా ఇలాంటి సమస్యలు ఉండొచ్చని పేర్కొంది. అయితే సమస్యలు, డ్యామేజెస్ ఉన్నాయని పేర్కొన్న సంస్థ, పనులు పూర్తి కాకుండానే పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలని 2020లో ఎలా కోరిందని విజిలెన్స్ ప్రశ్నించింది. అండర్‌టేకింగ్ తీసుకోకుండానే పని పూర్తయినట్లు 2021 మార్చిలో అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఫైనల్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీనిలో కుట్రకోణం దాగి ఉందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని విజిలెన్స్ పేర్కొంది. అందుకే ఫైనల్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.