Home Page SliderNational

ఎస్పీబీకి గౌరవంగా తమిళనాడు ప్రభుత్వ కీలకనిర్ణయం

గానగంధర్వుడిగా పేరుపొందిన గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతు విని పులకరించని సంగీతప్రియులు ఉండరు. ఆయన నాలుగవ వర్థంతి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఆయనకు గొప్ప గౌరవం కలిగించాలని నిర్ణయించింది. ఎస్పీబీ పేరుమీదుగా చెన్నై నుంగంబాకంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ఆయన పేరును పెట్టాలని ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారికంగా ప్రకటించారు. స్టాలిన్ నిర్ణయం పట్ల సంగీత ప్రియులు, బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబరు 25న ఆయన వర్థంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ విషయంగా ముఖ్యమంత్రికి బాలు కుమారుడు ఎస్పీ చరణ్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దీనికి స్టాలిన్ సంతోషంగా అంగీకరించారని అందుకే ఈ రోడ్డుతో ఎస్పీ కుటుంబానికి ఉన్న అనుబంధానికి గుర్తుగా ఈ పేరు పెట్టారని పేర్కొన్నారు. సినీ సంగీత ప్రపంచంలో తిరుగులేని రారాజుగా వెలుగొందారు బాలసుబ్రహ్మణ్యం. తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వంటి 16 భారతీయభాషలలో వేలాది పాటలు పాడిన ఏకైక గాయకుడు బాలు. 2020 సెప్టెంబర్ 25నాడు కరోనా మహమ్మారి కారణంగా ఆయన మనకు దూరమయ్యారు. ఆయన పాడిన అద్భుతమైన పాటలు గుర్తు చేసుకుంటూ అభిమానులు వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నారు.