బీఆర్‌ఎస్ కీలక నిర్ణయం..మేయర్, డిప్యూటీ మేయర్లపై వేటు
తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. దీనిలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. దీనికి కేటీఆర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నుండి మారి కాంగ్రెస్‌లో చేరిన మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమయ్యింది. వీరు బీఆర్‌ఎస్ పార్టీ నుండి గెలిచారు. వారు పదవుల నుండి వైదొలగాలని కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్లో బైఠాయించి తమ నిరసన తెలపాలని నిర్ణయించారు. తమ పార్టీకి ఉన్న సంఖ్యాబలంతో తిరిగి తమ పార్టీకే ఈ పదవులు దక్కుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు. కానీ ఈ కీలక సమావేశంలో ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వీరిలో లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, కృష్ణారావు, రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. దీనిపై ఎవరు ఇంకా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రేపటి కౌన్సిల్ సమావేశానికి అందరూ తప్పక హాజరు కావాలని కేటీఆర్ ఆదేశించారు.

