Home Page SliderNational

కర్ణాటక స్థానిక రిజర్వేషన్లపై ఫోన్‌పే సీఈవో కీలక వ్యాఖ్యలు

కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన స్థానిక రిజర్వేషన్లపై ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వోద్యోగులు దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేయవలసి వస్తుందని, మరి వారి పిల్లలకు కర్ణాటకలో ఉద్యోగాలు లేవా అంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో పుట్టి పెరిగిన తన పిల్లలు అక్కడ ఉద్యోగాలకు పనికిరారా అంటూ ప్రశ్నించారు. కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థలలో కూడా స్థానిక కన్నడిగులకే ఉద్యోగాలు కేటాయించాలని ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలలో ఈ నిబంధనను అమలు చేస్తే నాణ్యతా ప్రమాణాలు పడిపోతాయని, తమ ఆదాయాన్ని కోల్పోతామని వివిధ సంస్థల ప్రతినిధులు విమర్శించారు. ఇలాంటి నిర్ణయమే ఇతర కంపెనీలు కూడా తీసుకుంటే ఇతర రాష్ట్రాలలో కన్నడ ఉద్యోగులు తిరిగి రావల్సిందేనన్నారు. ప్రైవేట్ సంస్థలలో నాన్ మేనేజ్ మెంట్ కోటాలో 70 శాతం, మేనేజ్‌మెంట్ కోటాలో 50 శాతం ఉద్యోగాలను కన్నడ భాష మాట్లాడగలిగి, చదవడం, రాయడం వచ్చిన కన్నడిగులకే ఇవ్వాలని కార్మిక మంత్రిత్వ శాఖ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.