24 గంటల్లో 81 కోర్సులు పూర్తిచేసి రికార్డు సాధించిన కేరళ యువతి
“బేటి బచావో, బేటీ పడావో” నినాదమిచ్చారు మన ప్రధాని నరేంద్రమోదీ. ఆయన ఆశయాన్ని నిజం చేస్తున్నారు మన అమ్మాయిలు. శ్రద్ధగా చదివిస్తే ఎలాంటి రికార్డులైనా సాధించగలరని నిరూపిస్తున్నారు. ఒకటి, రెండూ కాదు ఏకంగా 81 కోర్సులను కేవలం ఒక్కరోజులో పూర్తిచేసి ప్రపంచ రికార్డు సృష్టించింది కేరళకు చెందిన రెహనా షాజహాన్. ఆన్‌లైన్ విధానంలో ఫేస్‌బుక్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీల నుండి SHORT TERM కోర్సునభ్యసించి 81 కోర్సుల్లో అవసరమైన మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించింది.
కొంతమందికి గట్టిగా కాసేపు చదవాలంటే చాలు ఎంతో కష్టమైపోతుంది. కొట్టాయంకు చెందిన రెహనా 24 గంటలు వదలకుండా ప్రయత్నం చేసి ఒక్కరోజులో అన్ని ఎగ్జామ్స్ రాసేసింది. రెహనా సోదరి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది. అమెను ఆదర్శంగా తీసుకుని సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనే ఆశయంతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో M.COM ఎంట్రన్స్ రాసింది. కానీ కేవలం సగం మార్కు తేడాతో అడ్మిషన్ కోల్పోయింది. ఆ సంవత్సరం వృథా చేయడం ఇష్టంలేక డిస్టెన్స్ కోర్సులు చేసింది. తర్వాత ఏడాది జామియాలో MBA సీటు సంపాదించి పూర్తి చేసింది. కొవిడ్ కాలంలో టైంను ఉపయోగించుకునే ఉద్దేశంతో ఎంబిఏ పూర్తయిన వెంటనే ఆన్‌లైన్ కోర్సులు మొదలు పెట్టింది.

దుబాయ్‌లోని ఓ కంపెనీలో HR గా పనిచేస్తున్న రెహనా తన తండ్రి ఆరోగ్యం కోసం ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చేసింది. ఇక్కడ విద్యార్థులకు కెరీర్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోచ్‌గా పనిచేస్తూ, ఆన్‌లైన్ కోర్సుల్లో శిక్షణ కూడా ఇస్తోంది.
ఒకసారి ఆమె ఒకేరోజులో 55 కోర్సులు పూర్తిచేసి, ఆమె సంస్థ సీఈవోకి చెప్పగా, వరల్డ్ రికార్డుకు ప్రయత్నం చేయమని సలహా ఇచ్చారు. అప్పటికి ప్రపంచరికార్డు 24 గంటల్లో 75 కోర్సులుగా ఉంది. దానిని మించడానికి ప్రయత్నించిన ఆమె 24 గంటల్లో 81 కోర్సులు పూర్తిచేసి.. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. మహిళలు గట్టిగా ప్రయత్నిస్తే మగవారికి ఎందులోనూ తీసిపోరని ఆమె నిరూపించింది కదూ..