Home Page SliderNational

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆదివారం కేజ్రీవాల్ విచారణ

Share with

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ ఆదివారం సీబీఐ విచారించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత, కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పుడు కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోతును తెలుసుకునేందుకు కేజ్రీవాల్‌ను విచారించాలని విచారణ సంస్థ భావిస్తోంది. కేజ్రీవాల్‌ను ఆదివారం విచారణకు హాజరు కావాలని సిబిఐ కోరిందని… దర్యాప్తులో కేంద్ర ఏజెన్సీ ఒక ముఖ్యమంత్రిని పిలిపించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారని తెలుస్తోంది. గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీ, రాజధానిలో మద్యం అమ్మకాలపై ప్రభుత్వ నియంత్రణను రద్దు చేయడంతో ప్రైవేట్ రిటైలర్లకు లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలతో ఇప్పటి వరకు ఇద్దరు ఆప్ మంత్రులు జైళ్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. లిక్కర్ పాలసీలో కోట్లాది కిక్‌బ్యాక్‌లు ఆప్ అందుకుందని, గత ఏడాది గోవాలో జరిగిన ఎన్నికల్లో ఈ సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారంలో వినియోగించినట్టు సీబీఐ అనుమానిస్తోంది. తాజా సాక్ష్యాలతో సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు తగిన ఆధారాలున్నాయని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఐతే సీబీఐ ఆరోపణలను ఆప్ కొట్టిపారేసింది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని మండిపడింది.