Home Page SliderNational

సిసోడియా అరెస్ట్ సీబీఐ అధికారులకు ఇష్టం లేదన్న కేజ్రీవాల్

లిక్కర్ పాలసీ విచారణలో తన డిప్యూటీ మనీష్ సిసోడియాను అరెస్టు చేయడాన్ని “చాలా మంది సీబీఐ అధికారులు” వ్యతిరేకిస్తున్నారని, “రాజకీయ ఒత్తిడి” కారణంగా ఆధారాలు లేకుండా బలవంతంగా అలా చేయవలసి వచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ట్వీట్ చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), రద్దు చేసిన లిక్కర్ పాలసీలో అక్రమాలకు సంబంధించి సిసోడియాను ఆదివారం ఆలస్యంగా అరెస్టు చేసింది. ఈ కేసులో అరెస్టు అయినవారిలో సిసోడియా అతి పెద్ద వ్యక్తి. “ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసులో” ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఢిల్లీ డిప్యూటీ సీఎంను అరెస్టు చేసినట్టు సీబీఐ రాత్రి ప్రకటించింది.

సీబీఐ ఆఫీసుకు వెళ్లే ముందు, సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులతో రోడ్‌షో నిర్వహించారు. ఆప్ అభివృద్ధి చెందుతుండటంతో… బీజేపీ భయపడుతుందని… నకిలీ కేసులో ఇరికించారని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీలో అవకతవకలపై సీబీఐ, ఈడీ విచారిస్తున్నాయి. “మనీష్ నిర్దోషి. అరెస్ట్ డర్టీ పాలిటిక్స్” అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, సిసోడియా అరెస్ట్ అయిన కొన్ని గంటల తర్వాత ట్వీట్ చేశారు. రాజధానిలో ప్రభుత్వ విద్యారంగంలో కీలక మార్పులతో సిసోడియా గుర్తింపు పొందారు. సిసోడియా ఆప్ పార్టీలో రెండో స్థానంలో ఉన్నారు. రాబోయే ఎన్నికలలో పలు రాష్ట్రాల్లో బీజేపీని ఆప్ సవాలు చేసే విధంగా తీర్చిదిద్దడంలో మనీశ్ కీలకంగా ఉన్నారు.