NationalNews

కేజ్రీవాల్‌ ప్రధాని పదవిపై కన్నేశారా..?

రెండేళ్ల తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టాలని ఓవైపు ప్రధాని మోదీ తహతహలాడుతున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇంటి పోరుతోనే సతమతమవుతోంది. ఇంకోవైపు తమ రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్న ప్రాంతీయ పార్టీలకు దేశం గురించి పట్టించుకునే తీరికే లేదు. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయం నల్లేరుపై నడకేనని.. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. కానీ.. ఓ ప్రాంతీయ పార్టీ దేశమంతా విస్తరించేందుకు చాపకింద నీరులా వ్యూహాలు రచిస్తూ దూసుకెళ్తోంది. అదే కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ.

పంచ సూత్రాలతో కేజ్రీవాల్‌ భారత యాత్ర
అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించిన స్వల్ప కాలంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తర్వాత పక్కనున్న పంజాబ్‌లోనూ పాగా వేశారు. ఇప్పుడు హర్యానాలో విస్తరించాలని ప్లాన్‌ చేస్తున్నారు. అంతకు ముందు మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్‌లో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత, నాణ్యమైన విద్యను అందిస్తామని, అధిక ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్లకు ముకుతాడు వేస్తామని హామీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా ` మేక్‌ ఇండియా నెం.1′ అనే నినాదంతో దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలబెట్టేందుకు పంచ సూత్రాలు పాటిస్తానని హామీ ఇస్తున్నారు. దేశ ప్రజలు పేదలుగా ఉన్నంత కాలం దేశం ధనిక రాష్ట్రంగా మారజాలదన్నారు.

కేజ్రీ పంచ సూత్రాలు ఏవంటే..

ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను అందించాలి. దాని కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను విరివిగా ప్రారంభించాలి. దేశ ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలి. వైద్య ఖర్చులతో పాటు మందులూ ఉచితంగానే సరఫరా చేయాలి. దేశంలో ఉపాధి లేని యువత ఉండకుండా చూడాలి. యువత సంపాదిస్తేనే కుటుంబం సుసంపన్నం అవుతుంది. అప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుంది. మహిళలకు పురుషులతో సమాన హక్కులుండాలి. ప్రతి మహిళకు సురక్షితమైన, గౌరవ ప్రదమైన జీవితం గడిపేందుకు సహకరించాలి. రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు లాభాలు వచ్చే చర్యలు చేపట్టాలి. రైతు పిల్లలంతా తాము పెద్దయిన తర్వాత రైతుగా మారతామనే పరిస్థితి తేవాలి.

విపక్షాలు ఏకతాటిపైకి వస్తాయా..?
ప్రజాకర్షకమైన ఈ నినాదాలతో సామాన్య ప్రజల మనస్సు గెలుచుకోవాలని కేజ్రీవాల్‌ భావిస్తున్నారు. అంతేకాదు.. భారత్‌ను అగ్ర స్థానంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌, బీజేపీతో పాటు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిస్తున్నారు. అంటే.. తననే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కేజ్రీవాల్‌ పరోక్షంగా కోరుతున్నారు. దేశ ప్రజలంతా మోదీ జపం చేస్తున్న ప్రస్తుత తరుణంలో.. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చే పరిస్థితి లేని స్థితిలో.. కేజ్రీవాల్‌ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాల్సిందే..!