కేసిఆర్ మాటలు పేదల కోసం, చేతలు పెద్దలకోసం…
‘కేసిఆర్ మాటలు పేదల కోసం, చేతలు పెద్దలకోసం’.. అని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్న జర్నలిస్టులతో మాట్లాడారు ఈటల. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా కేసీఆర్ ఎందుకు స్థలాలు జర్నలిస్టులకు ఇవ్వడం లేదు. వారి మీద అక్కసా ? కోపమా ? ద్వేషమా ? అని ప్రశ్నించారు. సమ్మె చేస్తే, ధర్నా చేస్తే కవర్ చేయాల్సిన జర్నలిస్టులు. ప్రజలకు కష్టాలు వస్తే ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లే జర్నలిస్టులు..ఇదే ధర్నా పార్క్ దగ్గర ఆందోళన చేయడం బాధాకరం అన్నారు. జర్నలిస్టులు పేదలు. పిల్లల్ని చదివించలేని దుస్థితిలో ఉన్నారు. జర్నలిస్టులను సీఎంలు కూడా గౌరవిస్తారు. వారికి ఏమీ లేకపోయినా ఆ గౌరవం దొరుకుతుంది అనే తృప్తిలో బ్రతుకుతున్నారు. సొంత ఇల్లు, చదువు, ఆరోగ్యం కోసం ప్రభుత్వం సహాయం చేస్తుంది అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఏమీ దక్కడం లేదు.

హైదరాబాద్ లో వేల ఎకరాల భూములు మాయం చేశారు, కానీ వీరికి మాత్రం ఇవ్వడం లేదు. ఐటీ కంపెనీలకు జాగాలు ఇచ్చారు. కానీ వారు ఇస్తామన్న ఉద్యోగాలు, సంపద రాలేదు. కానీ వారు మాత్రం రియల్ ఎస్టేట్ కు భూములు అమ్ముకున్నారని మండిపడ్డారు. పేదజర్నలిస్ట్ లు 200 గజాల జాగా అడుగుతున్నారు. అదికూడా ఫుకట్ కి ఇవ్వమనడం లేదు. ఆ ఆనాటి ప్రభుత్వ ధర కూడా చెల్లించారు. డబుల్ బెడ్ రూం కట్టిస్తా అన్నారు. కానీ కమలపూర్లో కడుతున్న ఇళ్లకు బిల్లులు ఇవ్వడం లేదు. సంపదకు కొదవలేదు ధనిక రాష్ట్రం అంటారు. బిల్లులు ఇవ్వకపోతే ఎలా ? హైటెక్ సిటీలో రూపాయికి ఒక ఎకరం లెక్క ఒక హాస్పటల్ కి ఇస్తారు. సొంత పార్టీకి 30 కోట్లు స్థలం 3 కోట్లుకు ఇచ్చుకుంటారు. ఒక ఎడ్యుకేషన్ సంస్థకు మూడు ఎకరాలు అప్పగించవచ్చు.

బంజారాహిల్స్ లో పేదల భూములు పెద్ద పెద్ద వాళ్లకు, గద్దలకీ కట్టబెడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వీరంతా బిచ్చగాళ్ల కాదు.. చదువుకున్నవారు. జర్నలిస్టుల ఉసురు పోసుకుంటే ఖబర్థార్. మన భూమి మనకు పైరవీ చేస్తే రాదు బరిగీసి కొట్లడుదాం.. మేము మీకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. కేసిఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అని, కేసీఆర్ మోసపు మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడో దళితులకు ఇచ్చిన 5800 ఎకరాల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యింది ఈ ప్రభుత్వం. తెలంగాణ తెచ్చుకున్న తరువాత మరో పోరాటం ఉంటుంది అని అప్పుడే చెప్పాను. ఇప్పుడు దానికి అందరు సిద్దం కావాలంటూ పిలుపునిచ్చారు ఈటల రాజేందర్.