పార్టీలు మారే వ్యక్తిని కాదు… కేసీఆర్ వెల్లగొడితే బీజేపీ అక్కున చేర్చుకొంది
రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, దేశ ప్రజానికానికి స్ఫూర్తి నింపాల్సిన జనవరి 26, గణతంత్ర ఉత్సవాలను తెలంగాణ సర్కారు జరపకపోవడం సిగ్గుచేటన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ గవర్నర్ పట్ల అనుసరిస్తున్న తీరు జుగుప్స కలిగిస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గవర్నర్ పట్ల చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మహిళా సమాజం తలదించుకుందన్నారు. గవర్నర్‌ను అవమాన పరచడం… రాజ్యాంగాన్ని, తెలంగాణ మహిళలను అవమనపరచడమేనన్నారు. కేసీఆర్ మొదటి నుంచి గవర్నర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదని… మొదట్లో గవర్నర్‌కు మొకరిల్లి వందనాలు చేశారన్నారు. కానీ తమిళిసై వచ్చాక గవర్నర్‌ను అవమానిస్తున్నారన్నారు. ఫ్యూడల్ కుటుంబంలో పుట్టిన వ్యక్తిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఐదేళ్ల పాటు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపారన్నారు. ఒక ఎస్సీ,ఒక బీసీ మహిళ లేకుండా అసెంబ్లీ నడుపుతున్న వ్యక్తి కేసీఆర్ అంటూ విమర్శించారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఈటల రాజేందర్ ఏనుగు రవీందర్ రెడ్డి, తుర్క నరసింహులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

సరూర్ నగర్ ఆర్ఫాన్ పాఠశాల లో 400 బాలికలకు ఒక్క టాయిలెట్ మాత్రమే ఉందన్నారు. ఢిల్లీ వచ్చి హాస్పిటల్స్,స్కూల్స్ తిరిగి చూసి అవన్నీ తెలంగాణలో అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్‌కి సిగ్గుండాలన్నారు. మహిళల పట్ల కేసీఆర్ చులకన భావంతో ఉన్నారన్నారు. సొంత నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రాలేదని రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని ఈటల విమర్శించారు. ధరణి పోర్టల్ వల్ల కలెక్టర్‌ల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ పల్లెల్లో కరెంట్ ఉండటం లేదని… గిరిజన,హరిజన కాలనీలల్లో మీటర్లు లేవని కరెంట్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కనపడటం లేదన్నారు. ట్రేడ్ ఫేర్‌లో కూడా తెలంగాణ భాగం కావడం లేదన్నారు. తెలంగాణ ప్రత్యేక దేశం… భారత్ లో భాగం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఈటల ఫైరయ్యారు.

గవర్నర్ ను అవమానించడం మానుకోవాలని హితవు పలికారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత నరేంద్ర మోడీదని… కానీ తెలంగాణా ముఖ్యమంత్రికి గవర్నర్‌ను గౌరవించే సంస్కారం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలను మింగేశాసిన కేసీఆర్… తాను గెలిచిన 13 నెలలు అయినా అసెంబ్లీలో మాట్లాడకుండా నా గొంతు నొక్కుతున్నారన్నారు ఈటల. మమ్మల్ని విమర్శించినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. 2023 వరకే కేసీఆర్‌కి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. తెలంగాణలో ప్రభుత్వ మార్పు ఖాయమన్నారు. తాను పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు ఈటల. కేసీఆర్ వెల్లగొడితే బీజేపీ అక్కున చేర్చుకుందని గుర్తు చేశారు. సీపీఐ, టిడిపి,కాంగ్రెస్ పార్టీలను ఎందుకు మింగుతున్నడో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. తనకు ఎవరి సానుభూతి అక్కరలేదన్న ఈటల… ప్రజల సానుభూతి ఉందన్నారు. నాపై పోటీ కోసం ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో అందరూ చూశారన్న ఈటల… తెలంగాణ ప్రజల అండ తనకు సంపూర్ణంగా ఉందన్నారు.

