మునుగోడు ఓటర్లకు కేసీఆర్ లేఖలు..!
మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం టీఆర్‌ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. బహుముఖ వ్యూహంతో బీజేపీ, కాంగ్రెస్‌ల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు స్కెచ్ వేస్తోంది. ఇప్పటికే ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేను ఇంచార్జిగా నియమిస్తూ మునుగోడు నియోజక వర్గంలో గులాబీ దండును దించింది. ఇప్పుడు మరో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. గత 8 ఏళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలకు సీఎం కేసీఆర్ స్వయంగా లేఖ రాయనున్నారు.

3.95 లక్షల మంది లబ్ధిదారులు..
ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, పంట రుణాల మాఫీ, గొర్రెల పంపిణీ, సీఎం రిలీఫ్ ఫండ్, గర్భిణీలకు కేసీఆర్ కిట్లు మొదలైన పథకాల ద్వారా మునుగోడు నియోజక వర్గంలో లక్షలాది మందికి పైగా లబ్ధి పొందారు. వీరికి ప్రభుత్వం నుంచి ఇప్పటికే రూ.10,260 కోట్లు అందజేశారు. ఆ వివరాలు తెలియజేస్తూ వీరందరికీ సీఎం కేసీఆర్ సంతకంతో లేఖలు పంపిస్తారని టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఆ లేఖలో లబ్ధిదారుని పేరుతో పాటు టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ కూడా ఇస్తారు. ఇలా వ్యక్తిగతంగా లేఖలు రాస్తే వారి మనసులు గెలుచుకోవచ్చని.. లబ్ధిదారుల్లో కొందరైనా టీఆర్‌ఎస్‌కు ఓటేస్తారని కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్‌ఎస్ నాయకులు చెప్పారు.