వేలాది వాహనాలతో కేసీఆర్ భారీ ర్యాలీ
మునుగోడు ప్రజా దీవెన యాత్రకు సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఉప్పల్ భగాయత్ నుంచి 5 వేల కార్లతో ర్యాలీగా వెళ్లింది. కేసీఆర్ బస్సులో వెళ్తుండగా కార్లు, బైకులపై పార్టీల నేతలు, కార్యకర్తలు ఆయనను అనుసరించారు. పార్టీ అధినేత వెళ్లే మార్గంలో టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి 400 వాహనాల్లో వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఘట్‌కేసర్ నుంచి 200 వాహనాలతో వచ్చిన మంత్రి మల్లారెడ్డి ఉప్పల్ చౌరస్తాలో కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. పెద్ద అంబర్‌పేట్ వద్ద మరో 1500 వాహనాల్లో టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు సీఎం ర్యాలీకి జతకూడారు. ర్యాలీ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తీన్మార్ స్టెప్పులు వేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు 4 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు.

