Home Page SliderTelangana

మహిళలు బలోపేతమయ్యేలా కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో…హరీష్ రావు

మహిళలు బలోపేతమయ్యేలా కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో రెడీ అవుతోందని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీష్‌రావు చెప్పారు. ఈ రోజు నారాయణపేట జిల్లా కోస్గిలో 150 పడకల ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కేసీఆర్ ప్రభుత్వమే. 3వ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే ఏడాదిలోపు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ వాగ్ధానం చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మీనమేషాలు లెక్కిస్తోందని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచేది లేదు, కాంగ్రెస్ కూడా అదే కోవలో గెలిచేదిగా కనబడట్లేదు. ఓటుకు నోటు కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు. మాటలు చెప్పే సర్కార్ కావాలా, చేతల ముఖ్యమంత్రి కావాలో మీరే ఆలోచించుకోండని హరీష్ రావు అన్నారు. మూడు గంటలు విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో, 24 గంటలు కరెంట్ ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ (బీఆర్ఎస్) పార్టీ కావాలో మీరే ఆలోచించుకోండని చెప్పారు.