NewsTelangana

మునుగోడు నీదా… నాదా… కేసీఆర్ వర్సెస్ అమిత్ షా

మునుగోడు గడ్డ ఎన్నికలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి… ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మునుగోడు కేంద్రంగా సాగుతోంది. ఉపఎన్నికలో గెలిచేందుకు అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ హోరాహోరీ తలపడబోతున్నాయ్. రేపు మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. సీఎం కేసీఆర్ మునుగోడులో బరిలో నిలిచేదెవరన్నదానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం కన్పిస్తోంది. అమిత్‌షా మునుగోడు పర్యటన చాన్నాళ్ల కిందటే ఫైనల్ కాగా… కేసీఆర్ సైతం ఆయన పర్యటనకు ఒక రోజు ముందుగానే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సై అంటున్నారు. మునుగోడులో గెలిచి తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంటే… టీఆర్ఎస్ సైతం విజయం సాధించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది.

ఎన్నికలు జరిగితే తప్ప ప్రజల బాగోగుల గురించి కేసీఆర్ పట్టించుకోడంటూ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలు మునుగోడులో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఇచ్చిన హామీల అమలును మరిచిపోతారని టీఆర్ఎస్ పార్టీపై విపక్షాలు మండిపడుతున్నాయ్. గతంలో కేసీఆర్ మాటలను ప్రజలు విశ్వసించేవారని… ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నాయ్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. గతంలో ఎన్నికలు వచ్చాయంటే ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసే టీఆర్ఎస్… మనుగోడు అభ్యర్థి విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అడుగులు వేస్తోంది. గులాబీ పార్టీ నుంచి బరిలో దిగేందుకు నాలుగురైదుగురు అభ్యర్థులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కేటీఆర్ అనుచరుడు కర్నాట విద్యాసాగర్‌తో సహా మరికొందరు నేతలు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే గెలిచే అభ్యర్థినే బరిలోకి దించాలని భావిస్తున్నారు కేసీఆర్. ఓవైపు పార్టీ బలంతోపాటు, అభ్యర్థికి బలం ఉంటేనే విజయం సాధ్యమన్న భావనలోకి వచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో కేసీఆర్ ఈసారి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారోనన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో ఉంది.

మరోవైపు హుజూరాబాద్‌ గెలుపు తర్వాత బీజేపీ ఫోకస్ అంతా తెలంగాణపై పెట్టింది. బీజేపీ హైకమాండ్ తెలంగాణలో అధికారం దక్కించుకోవడంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తోంది. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన తర్వాత… తెలంగాణకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నది బీజేపీ చెప్పకనే చెబుతోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న బీజేపీ కలలను నిజం చేసేందుకు పార్టీ నేతలు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలతో చర్చిస్తూ.. పార్టీని ఏవిధంగా ముందుకు నడపాలన్నదానిపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మునుగోడులో బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో బీజేపీ భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంది. ఇప్పటికే ఈటల రాజేందర్ పార్టీకి బలాన్ని బలగాన్ని అందిస్తున్న తరుణంలో రాజగోపాల్ రెడ్డి సైతం పార్టీకి మరింత ఊపు తీసుకొస్తారని బీజేపీ భావిస్తోంది.

హోం మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణ గడ్డపై అడుగుపెడుతుంటే… పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో సాగుతున్న పాలనపైనా, అమిత్ షా ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఫ్యామిలీ కోసం కేంద్రం అప్పులకు అనుమతివ్వాలా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కొడుకును సీఎం చేయాలని తపిస్తున్నారని… ఇటీవల సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ సభలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఇకపై సచివాలయానికి వెళ్లాల్సిన అవసరమూ ఉండదన్నారు. ఇటీవల ఇప్పటికే కేసీఆర్ సర్కారుపై విమర్శలు కురిపించిన అమిత్ షా.. మునుగోడు వేదికగా గట్టి సందేశమే ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఆవిశ్యతకను అమిత్ షా ప్రజలకు మరోసారి వివరించనున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో జరిగే మేలును చెప్తారు. ఇప్పటికే టీఆర్ఎస్ సర్కారుపై అటు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు రంగం సిద్ధమైందన్న అభిప్రాయం కూడా విన్పిస్తోంది.