Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

నేడు సిట్ విచారణకు రాలేనన్న కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సిట్ అధికారులకు ఒక లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల పర్వం కొనసాగుతున్నందున, రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నానని, అందుకే శుక్రవారం నాటి విచారణకు హాజరు కాలేనని తెలిపారు. ఈ విచారణను మున్సిపల్ ఎన్నికల తర్వాత నిర్వహించాలని ఆయన కోరారు.

అయితే, ఒకవేళ విచారణ జరపాలంటే, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఉండే వెసులుబాటు ప్రకారం, తనను తన నివాసమైన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని కేసీఆర్ పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా దర్యాప్తుకు సహకరిస్తానని, అయితే ప్రస్తుతానికి కొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సమయంలోనూ కేసీఆర్ ఇదే తరహాలో గడువు కోరగా, కమిషన్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సిట్ అధికారులు కేసీఆర్ విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.