30న కేసీఆర్.. 31న నడ్డా మునుగోడులో భారీ సభలు
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నవంబరు ఒకటో తేదీన ప్రచారానికి చివరి రోజు. దీంతో చివరి వారం రోజులు ఉధృతంగా ప్రచారం చేసేందుకు ప్రధాన పార్టీలు కదన రంగంలోకి దిగాయి. భారీ బహిరంగ సభలతో ప్రచారాన్ని ముగించేందుకు టీఆర్ఎస్, బీజేపీ సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నెల 30వ తేదీన చండూరులో లక్ష మందితో భారీ సభకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. నియోజక వర్గంలోని ప్రజలను బస్సుల్లో తరలించేందుకు గులాబీ దళాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ సభ ద్వారా నియోజక వర్గంలో బలాన్ని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. మునుగోడులో విజయం సాధించి తీరాల్సిందేనని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్ కంకణం కట్టుకున్నారు.

బీజేపీ కూడా తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈ నెల 31వ తేదీన భారీ బహిరంగ సభకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నియోజక వర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు ఇటీవల నడ్డా సమాధి కట్టడం దుమారం రేపింది. టీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని మండి పడుతున్న బీజేపీ నేతలు ఈ సభ ద్వారా నియోజక వర్గంలో తమ రేంజ్‌ను నిరూపించాలని భావిస్తున్నారు. ఒక్క రోజు తేడాతో టీఆర్ఎస్, బీజేపీ సభలు నిర్వహించనుండటంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రెండు పార్టీల అధినేతలు రంగంలోకి దిగనుండటంతో ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.