“కేసీఆర్ ఝూఠా మాటలు’’ పోస్టర్ విడుదల
కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ రూపొందించిన “కేసీఆర్ ఝూఠా మాటలు’’ పోస్టర్‌ను తెలంగాణ బీజేపీ ఛీప్ బండి సంజయ్ విడుదల చేశారు. కేసీఆర్ మరోసారి మునుగోడు ఉప ఎన్నికల్లో పచ్చి అబద్దాలు, తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. మందు, మాంసం మనీతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఒక దళిత నాయకుడిని సీఎంను చేస్తానని చెప్పి, మాట తప్పితే తల నరుక్కుంటానన్నారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఎక్కడో చెప్పాలని పోస్టర్ ద్వారా ప్రశ్నించారు. రైతులు పండించిన చివరి ఆఖరి గింజ వరకు మేమే కొంటామని చెప్పి ఎక్కడ కొంటున్నారో చూపించాలన్నారు. తెలంగాణాలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఎక్కడ ఇచ్చారో చూపించాలన్నారు. నిరుద్యోగులందరికీ రూ. 3,015ల నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానన్నారు బండి సంజయ్. కేసీఆర్ ఝూఠా మాటల పోస్టర్లను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ శ్రేణులను బండి సంజయ్ కోరారు.

