కేసీఆర్ ఓడిపోవుడు పక్కా. గజ్వేల్లో ఈటల ఎన్నికల ప్రచారం
నన్ను టీఆర్ఎస్ నుండి వెళ్లగొట్టటమే కాకుండా రాజీనామా చేయాలి నువ్వు కేసీఆర్ బొమ్మ మీద గెలిచావ్ అన్నారు. నాపుట్టుకనే రేషంకల్ల పుట్టుక. నా బతుకే కొట్లాట. తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర్ రెడ్డితో కొట్లాడిన.. పట్టుమని పదిసీట్లు గెలవలేదు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అని అడిగిన రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వన్నన్న కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో.. తెలియదన్నారు ఈటల. రోశయ్యను ఎదుర్కొన్నానన్న ఈటల… రేషం కల్ల వాడినే కాబట్టే కేసీఆర్‌తో కొట్లాడుతున్నానన్నారు. అందరితో పెట్టుకున్నావ్.. నాతో గోక్కుంటున్నావ్.. నాతో అంటే ధర్మంతో పెట్టుకున్నావు కేసీఆర్ అంటూ ఈటల దుయ్యబట్టారు. అంకిరెడ్డిపల్లికి మా జమ్మికుంట సంబంధాలు ఉన్నాయట. శివాజీ వారసులు ఉన్నారట. వారు ధర్మం వైపు ఉంటారన్నారు ఈటల. ఇక్కడ జరిగే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు, పాండవులకు యుద్ధం జరుగుతోంది. పాండవుల పక్షాన ఉండాలని కోరారు ఈటల.

మీ పిల్లలకు నౌకర్లు వచ్చాయా ? బీజేపీ వస్తే ఎప్పటికప్పుడు ఉద్యోగనోటిఫికేషన్ ఇస్తాం. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దిక్కులేదు. ఇక వేరే నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? రుణమాఫీ ఎందుకు చెయ్యలేదు.. డబ్బులు లేకనా? మనసు లేకనా ? కేసీఆర్ సమాధానం చెప్పాలి. ప్రజల్లోకి రావడానికి ముఖం లేదన్నారు ఈటల. పెన్షన్ ఇవ్వడం లేదు… కానీ పెద్దకొడుకు అని చెప్పుకుంటున్నాడు. వందమందికి ఒకటి చొప్పున బెల్ట్ షాపులు పెట్టాడు. కేసీఆర్ మనకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి – 2500 కోట్లు, పెన్షన్ – 11 వేల కోట్లు అయితే.. సారా అమ్మి మనదగ్గర తీసుకుంటుంది – 45 వేల కోట్లు. తాగి తాగి రోగాలు వస్తున్నాయి, లివర్, కిడ్నీలు కరాబ్ అవుతున్నాయి. పుస్తెలతాళ్ళు డాక్టర్ల కాళ్ళ మీద పెట్టి నా ఆడబిడ్డలు భర్తను కాపాడమని వేడుకుంటున్నారు. భర్త బతికితే అప్పు, లేకపోతే అప్పుతో పాటు పుస్తెలతాడు కూడా తెంపుకొని వస్తున్నారు. బెల్ట్ షాపుల్లో, తాగిపించడంలో, పుస్తెల తాళ్లు తెంపడంలో తెలంగాణను కేసీఆర్ నంబర్ వన్ చేశారు. అందుకోసమేనా మనం కేసీఆర్‌కు ఓటేసిందన్నారు ఈటల.

తాను ఉపఎన్నికల్లో కొట్లాడే వేళ కేసీఆర్, 6 నెలలు హుజూరాబాద్ లో చెయ్యని పని లేదని గుర్తు చేసుకున్నారు. మనల్ని బోల్తా కొట్టించి మళ్ళీ గెలవడానికి ఓటుకు 10 వేలు ఇస్తారట.. తీసుకోండి. ప్రమాణం చేయమంటారు. చేయండి, కాని మనసులో ధర్మానికి ఓటు వేస్తా అని ముందే ప్రమాణం చేసుకొని.. పైకి వాళ్ళు చెప్పింది చేయండి. హుజూరాబాద్ లో ఇలానే చేశారు. ఇచ్చిన డబ్బులు తీసుకొని కర్రుగాల్చి వాతపెట్టారు. అది కేసీఆర్ అయ్య సొమ్ము కాదు మన నోరు కొట్టి వసూలు చేసిన డబ్బులు ముక్కుపిండి తీసుకోండి. అన్యాయాన్ని ఎదిరించి ధర్మంకోసం కొట్లాడుతున్న ఈటలరాజేందర్ ని ఆశీర్వదించండి. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం అంతా నీళ్లు ఇచ్చామని చెప్తున్నారు. కానీ బందారం, అంకిరెడ్డిపల్లి, దర్గాకు సాగునీరు అందలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అందరికీ నీళ్లిస్తామన్నారు ఈటల.


