NewsTelangana

గవర్నర్‌ అధికారాలకు కేసీఆర్‌ సర్కారు కత్తెర..?

తెలంగాణ గవర్నర్‌ అధికారాలకు కత్తెర వేసేందుకు కేసీఆర్‌ సర్కారు ప్లాన్‌ చేస్తోంది. యూనివర్సిటీల చాన్స్‌లర్‌ పదవి నుంచి గవర్నర్‌ను తొలగించే విషయాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేరళ ప్రభుత్వం కూడా అక్కడి గవర్నర్‌ను ఒక యూనివర్సిటీ చాన్స్‌లర్‌ హోదా నుంచి తొలగించింది. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ఈ విషయం న్యాయస్థానం వరకూ వెళ్లింది. తెలంగాణ ప్రభుత్వం కూడా గవర్నర్‌ను వర్సిటీల చాన్స్‌లర్‌గా తొలగిస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై సాంకేతికంగా, న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలను పరిశీలిస్తోంది.

నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు..

ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ సర్కారు భావిస్తోంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అసెంబ్లీ వేదికగా చర్చించాలని నిర్ణయించింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగ్బంధించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటోంది. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా.. కేంద్రం సెస్సులపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసేందుకు కసరత్తు చేసే బాధ్యతను ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కేసీఆర్‌ అప్పగించారు. కేంద్రం కుట్ర వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా ఎంతమేరకు నష్టమవుతోందో ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పలు కీలక పథకాలను ఈ సమావేశాల్లో ఆమోదింపజేసుకొని త్వరగా అమలు చేయాలని కసరత్తు చేస్తున్నారు.