సొంత ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్ చేస్తున్న కేసీఆర్: బూర
హైదరాబాద్, మనసర్కార్: బీజేపీ ఉద్యమ పార్టీ అని.. టీఆర్‌ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీగా మారిందని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధాలు ఎక్కువయ్యాయని, అందుకే తాను టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చానని చెప్పారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ తన సొంత ఎమ్మెల్యేలనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు ఓట్లు, సీట్లు, డబ్బులే ముఖ్యమని.. ఒక్కో ఎమ్మెల్యే బూత్‌కు రూ.2 కోట్లు చొప్పున ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

ఫ్లోరోసిస్‌ను తగ్గించామని చెబుతున్న టీఆర్‌ఎస్ నేతలు మునుగోడులో ఫ్లోరోసిస్ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. అంటే లేని జబ్బుకు చికిత్స చేస్తారా..? అని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల తర్వాత బీజేపీలోకి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భారీగా వస్తారని జోస్యం చెప్పారు. ఈటల రాజేందర్, స్వామిగౌడ్, జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అందరూ కూడా ఆత్మ గౌరవం కోసమే టీఆర్‌ఎస్ నుంచి బయటికి వచ్చామని స్పష్టం చేశారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీలా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.