గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని కవిత లేఖ
రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ గురువారం రాశారు . గ్రూప్-1 నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘించబడ్డాయని ఆమె ఆరోపించారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని సీజేఐని అభ్యర్థించారు. ఇటీవలే హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో 562 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.
తెలుగు మీడియం అభ్యర్థులపై అన్యాయం జరిగిందని కవిత పేర్కొన్నారు. ట్రాన్స్‌లేషన్ లోపాల కారణంగా ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, అందువల్ల మార్కుల్లో భారీ వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అంతేకాక, ప్రిలిమ్స్ పరీక్షకు ఒక హాల్ టికెట్ నంబరు, మెయిన్స్ పరీక్షకు మరో నంబరు కేటాయించడం కూడా అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తించిందని కవిత లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు జోక్యం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.