సీఎం రేవంత్ రెడ్డికి కవిత సవాల్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. ‘‘కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ పదే పదే పిలవడం కాకుండా, మీరు మహిళలకు ఇస్తానని చెప్పిన రూ.2,500 ప్రోత్సాహం, తులం బంగారం, పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదో ముందు చెప్పండి’’ అంటూ కవిత డిమాండ్ చేశారు. అసలు విషయాలను మరిచిపోయి దృష్టిని మళ్లించేలా ‘డైవర్షన్ పాలిటిక్స్’కు రేవంత్ పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ‘‘కేసీఆర్ అసెంబ్లీకి రావడం కాదు.. తామే పోలీస్ కంట్రోల్ సెంటర్‌కి వస్తామని’’ ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీరన్న జాగృతిలో చేరికపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జై తెలంగాణ అని ఒక్కసారి కూడా పలకలేదని విమర్శించిన ఆమె, రైతు రుణమాఫీ, సింగరేణి ఉద్యోగాలపై ప్రభుత్వం కనీస బాధ్యత చూపడం లేదని పేర్కొన్నారు. ‘‘సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోం’’ అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి ‘‘అవినీతి చక్రవర్తి, అసమర్థ ముఖ్యమంత్రి’’ అనే బిరుదును బీఆర్ఎస్ ఇచ్చిందని ఆమె స్పష్టం చేశారు. భద్రాచలం పరిసర ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేసేందుకు తుమ్మల నాగేశ్వరరావు చొరవ చూపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘‘భద్రాచలం రాముడి భూములు పురుషోత్తపట్నంలో ఉన్నాయి, భక్తుల మనోభావాలను గౌరవించాలని’’ కోరారు. ప్రభుత్వం ప్రజల మోసాలను గుర్తించలేదని భావించకూడదని, ప్రజలు గమనిస్తున్నారని ఆమె స్పష్టంగా తెలిపారు.

